అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
– రూ.28 లక్షల సొత్తు స్వాధీనం..
బంజారాహిల్స్: నగరంలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడ్డ ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (గోల్కొండ జోన్), బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో భాగంగా వారిని అరెస్టు చేసి రూ.28 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తంజీమ్ జాకీర్ అలీ (30), మొహమ్మద్ సద్దాం (32), షానవాజ్ అలియాస్ షానవాజ్ ఖాన్ (29)లు స్నేహితులు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో బట్టల దుకాణంలో పనిచేసే తంజీమ్ అలీ, సద్దాంలకు ఆదాయం సరిపోకపోవడంతో హైదరాబాద్‌లో చెఫ్‌గా పనిచేస్తున్న షానవాజ్‌ఖాన్ సహాయంతో నగరానికి వచ్చారు. వీరు తలాబ్‌కట్టలో నివాసం ఉంటున్నారు. నగరంలో దొంగతనాలు చేయాలని పథకం వేశారు. తొలుత తుకారాంగేట్ పరిధిలో ఒక బైక్‌ను దొంగిలించారు. ఆపై ఐరన్‌రాడ్లు, స్క్రూడ్రైవర్ల సహాయంతో బంజారాహిల్స్, ఎస్‌ఆర్‌నగర్, డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ల పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొత్తును కొంత తమ నివాసంలో దాచి, మరికొంత భాగాన్ని విక్రయించడానికి యూపీలోని తమ బంధువు రిజ్వాన్‌కు పంపేవారు. ఫిబ్రవరి 18న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వారిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 160.84 గ్రాముల బంగారు ఆభరణాలు, 666 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.3,28,000 నగదు, ీ ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, ఇమిటేషన్ జ్యువెలరీని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.28,61,732 ఉంటుందని పోలీసులు తెలిపారు.


