అన్ని స్థాయిల్లో ప్రక్షాళన
● ఔట్‌సోర్సింగ్ ఆపరేటర్లకూ బదిలీలు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణ అవసరాలకనుగుణంగా అధికారులు, సిబ్బంది బదిలీలు చేపట్టిన కమిషనర్ ఆర్‌వీ కర్ణన్.. ప్రక్షాళన చర్యలకూ శ్రీకారం చుట్టారు. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అడిషనల్ కమిషనర్లు సహా జాయింట్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, సీనియర్.. జూనియర్.. రికార్డు అసిస్టెంట్‌ల వరకు భారీ స్థాయిలో బదిలీ చేశారు. అంతేకాదు.. చివరకు ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను సైతం మూకుమ్ముడిగా బదిలీ చేశారు. జీహెచ్‌ఎంసీలోని చాలా విభాగాల్లో అధికారుల కంటే ఈ ఆపరేటర్ల ప్రభావమే ఎక్కువ. ఫైళ్లన్నీ ఈ–ఆఫీస్‌లోనే నడుస్తుండటంతో అవకాశాల్ని ఆసరా చేసుకొని ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడటం గతంలో ఎన్నో సందర్భాల్లో బయటపడింది. కొందరు అధికారుల డిజిటల్ కీలు సైతం ఆపరేటర్ల వద్దే ఉంటాయి. ఆఫీసర్లు చేయాల్సిన పనుల్ని వీరే చేస్తారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లు, టెండరు నోటిఫికేషన్లను సైతం జారీ చేసే ఆపరేటర్లున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని.. అలవాటు పడిన స్థానంలో కంటే వేరే ప్రాంతానికి బదిలీచేస్తే.. కొంతకాలమైనా అక్రమాలు ఆగవచ్చనే తలంపుతో వందల సంఖ్యలో ఆపరేటర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు.


