చుక్కేశారు..చిక్కారు
● ‘స్పెషల్ డ్రైవ్’లో పట్టుబడ్డ 270 మంది
సాక్షి, సిటీబ్యూరో: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి చెక్ చెప్పడానికి గత నెల 24 నుంచి 31 వరకు ఇవి కొనసాగాయి. ఈ తనిఖీల్లో చిక్కిన ‘నిషా’చరుల్లో 270 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ బి.జోయల్ డెవిస్ గురువారం వెల్లడించారు. స్పెషల్ డ్రైవ్‌లో చిక్కిన వారికి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో (టీటీఐ) అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆపై న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు 270 మందిని దోషులుగా నిర్ధారిస్తూ జైలు శిక్ష విధించింది. దీంతో ట్రాఫిక్ విభాగం అధికారులు వారిని జైలుకు తరలించారని జోయల్ డెవిస్ తెలిపారు. వీళ్లు పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు, వారు విద్యనభ్యసిస్తున్న విద్యా సంస్థలకు లేఖలు రాస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
నాగోలు/జీడిమెట్ల : నగరంలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. నాగోలు, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ సంఘటనలు జరిగాయి.
● నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన మేరకు.. హయత్‌నగర్ రవి నారాయణ రెడ్డి నగర్ కాలనీకి చెందిన సిద్ధులు (34) బుధవారం రాత్రి ఆటోలో ఇంటికి వెళుతున్నాడు. భారత్ పెట్రోల్ బంక్ వద్ద గౌరెల్లి వైపు నుండి వచ్చిన మరో ఆటో వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో సిద్దులు తీవ్రంగా గాయపడగా 108 అంబులెన్స్‌లో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఢీకొట్టిన ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
● ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికి అక్కడే మృతిచెందాడు. జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి (23) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు బుధవారం రాత్రి విష్ణువర్ధన్‌రెడ్డి స్నేహితుడు దిలీప్‌రెడ్డితో కలిసి షాపూర్‌నగర్ నుండి చింతల్ వైపు బైక్‌పై వెళ్తున్నాడు. ఈక్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో విష్ణువర్ధన్‌రెడ్డి అక్కడికి అక్కడే మృతిచెందాడు.తీవ్రంగా గాయపడ్డ దిలీప్‌రెడ్డి అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇంటి యజమానిని గొడ్డలితో నరికి..
● గౌడవెల్లిలో దారుణ హత్య
మేడ్చల్ రూరల్: ఇంటి యజమానినే గొడ్డలితో నరికి చంపాడో వ్యక్తి. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన గోమారం లక్ష్మారెడ్డి (42) పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతని ఇంట్లో మలిగ లింగం (50) అద్దెకు ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి ఇంట్లో మద్యం తాగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న లింగం అందుబాటులో ఉన్న గొడ్డలితో లక్ష్మారెడ్డిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు.
కటకటాల్లోకి భార్యాహంతకుడు
రహమత్‌నగర్: భార్యను కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని బోరబండ పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బోరబండ ఎస్‌హెచ్‌ఓ సురేందర్ గురువారం ఈ వివరాలను వెల్లడించారు. రహమత్‌నగర్ డివిజన్ రాజీవ్‌గాంధీనగర్‌లో సోమవారం ఆంజనేయులు అనే వ్యక్తి రోకలి బండతో కొట్టి భార్యను హత్య చేసి అదే రాత్రి షోలాపూర్ పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు ముగ్గురితో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. షోలాపుర్ నుంచి తన సొంత గ్రామమెన చింతకుంటకు ఆంజనేయులు వచ్చాడన్న సమాచారంతో పోలీసుల బృందం అక్కడికి చేరుకుని ఆదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆంజనేయులును గురువారం రిమాండ్ తరలించామని ఎస్‌హెచ్‌ఓ సురేందర్ వెల్లడించారు.


