రూ.వెయ్యి కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్.. అక్కడ స్థలం విలువ గజం రూ.2 లక్షలు.. అలాంటి ప్రాంతంలో పార్కును 150 గజాల మేర కబ్జా చేశాడో ప్రబుద్ధుడు. అలాగే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు చేరువలోని ఖానామెట్ ప్రాంతం.. అక్కడ ఎకరం రూ.200 కోట్లు. ఐదెకరాల వెలమ సంఘానికి గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమి విలువ రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా. ఆ కేటాయింపులపై కొంతమంది అభ్యంతరం చెప్పడంంతో కోర్టు స్టే ఇచ్చింది. ఇదే అదునుగా ఆక్రమణల పర్వానికి తెరదీశారు. కబ్జారాయుళ్లు ఈ రెండు కబ్జాలపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో హైడ్రా అధికారులు పరిశీలించారు. కబ్జాలను నిర్థారించుకుని బుధవారం ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేశారు. ఇలా మొత్తం రూ.1,003 కోట్ల ప్రభుత్వ ఆస్తిని హైడ్రా కాపాడింది.
కబ్జా చేసిన కిరాయిదారుడు..
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి ఔట్‌గేటు ఎదురుగా రెండెకరాల మేర పార్కు ఉంది. అక్కడ ఓ ఇంటిని కిరాయికి తీసుకుని లేడీస్ హాస్టల్ నడుపుతున్న వ్యక్తి కన్ను ఆ పార్కు స్థలంపై పడింది. ఇంకేముంది.. 150 గజాల మేర పార్కును ఆక్రమించాడు. కాంపౌండ్ దాటి పార్కులోకి 50 గజాల మేర జరిగి పాత భవనానికి ఆనుకుని మరో నిర్మాణం చేపట్టాడు. ఒక్కో అంతస్తులో గదులు నిర్మించాడు. ఇంటి యజమాని కూడా ఈ కబ్జాలపై మౌనంగా ఉన్నాడు. పార్కు వైపు గేటు పెట్టి 100 గజాల మేర ఫార్మ్‌హౌస్ మాదిరి సొంత పార్కును అభివృద్ధి చేసుకుని వాడుకుంటున్నాడు. అక్కడ చుట్టుపక్కల నివాసితులు అభ్యంతరం వ్యక్తంచేశారు. హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించింది. పార్కులోకి 50 గజాల మేర జరిగి నిర్మాణం చేపట్టినట్లు నిర్థారించుకుంది. మరో 100 గజాల మేర హద్దులు వేసుకుని ఆక్రమణ చేసినట్టు స్పష్టం చేసుకుంది. ఈ మేరకు బుధవారం మూడంతస్తుల నిర్మాణాన్ని తొలగించారు. పార్కు కబ్జా ప్రయత్నాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టి ఫెన్సింగ్ వేశారు. కబ్జాకు పాల్పడిన వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఖానామెట్‌లో ఐదెకరాలు..
హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు సమీపంలోని ఖానామెట్‌లో ఆల్ ఇండియా వెలమ సంఘానికి ఐదెకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలం చుట్టూ ప్రీకాస్ట్ వాల్‌లో ప్రహరీ నిర్మిస్తుండగానే, కుల సంఘాలకు స్థలాలు కేటాయించడంపై కొంతమంది కోర్టుకెక్కడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే అదునుగా ఆ స్థలాన్ని వెనుక వైపు నుంచి అక్కడ ఉన్న స్థానికులు మట్టిపోస్తూ కబ్జా చేస్తున్నారని, అదేమని అడిగితే వాచ్‌మెన్‌పై దాడి చేస్తున్నారని ఆ సంఘం ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కోర్టు తీర్పును బట్టి నిర్ణయం ఉంటుంది. ఈ లోగా అక్కడి స్థలం కబ్జాకు గురికాకుండా చూడాలని హైడ్రాను కోరారు. ఈ మేరకు పరిశీలించి ఐదెకరాల మేర ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటుచేసింది.
జూబ్లీహిల్స్‌లో పార్కు స్థలం,ఖానామెట్‌లో ఐదెకరాల ప్రభుత్వ భూమికి రక్షణ


