న్యూ ఇయర్.. ప్లీజ్ హియర్!
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు
● నేటి నుంచే నగరంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
● క్షేత్రస్థాయి అధికారులతో సీపీ సజ్జనర్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ వచ్చెనని, సంబరాలు తెచ్చెనని రోడ్లపై హంగామా సృష్టించారో.. హద్దు మీరి ప్రవర్తించారో.. జర జాగ్రత్త! పోలీసులు చూస్తున్నారు.. నిఘా నేత్రం కనిపెడుతోంది! నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. నేటి నుంచి న్యూ ఇయర్ రోజు వరకు తాగి వాహనాలు నడిపే వారిపై నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(టీజీఐసీసీసీ)లో మంగళవారం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల బందోబస్తుపై సీపీ సజ్జనర్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు. హాట్ స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 31న రాత్రి నగర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, ఇందుకోసం 7 ప్లటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నామని చెప్పారు.
పట్టుబడితే రూ.పదివేల జరిమానా..
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతోపాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష తప్పదని సీపీ హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే ’డెసిగ్నేటెడ్ డ్రైవర్’ను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్‌లను ఆశ్రయించాలని సూచించారు. యువత రోడ్లపై రేసింగ్‌లు, వీలింగ్‌లు, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మఫ్టీలో 15 షీ టీమ్స్ నిఘా...
డిసెంబర్ 31 రాత్రి పబ్‌లు, త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నిబంధనలు కచ్చితంగా పాటించాలని, డెసిబెల్స్ పరిమితి దాటితే సౌండ్ సిస్టమ్‌లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్లలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని, అలాంటి వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. వేడుకల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్లలో మఫ్టీలో 15 షీ టీమ్స్‌ను ఉంచుతామని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు సీపీ(క్రైమ్స్) ఎం.శ్రీనివాసులు, వివిధ విభాగాల డీసీపీలు ఎన్.శ్వేత, రక్షితాకృష్ణమూర్తి, శ్రీ రూపేష్, ఆర్. వెంకటేశ్వర్లు, వి.అరవింద్‌బాబు, లావణ్య నాయక్ జాదవ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


