మార్కుల వేట.. అక్రమాల బాట | - | Sakshi
Sakshi News home page

మార్కుల వేట.. అక్రమాల బాట

Feb 6 2026 11:43 AM | Updated on Feb 6 2026 11:43 AM

మార్కుల వేట.. అక్రమాల బాట

మార్కుల వేట.. అక్రమాల బాట

సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని కొన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు విద్యార్థులకు గరిష్ట మార్కులు తెప్పించేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్నాయి. నిఘా నుంచి తప్పించుకునేందుకు యాజమాన్యాలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగా ఆపేస్తుండగా, మరికొన్ని చోట్ల కెమెరా కంటికి ఆనని రీతిలో విద్యార్థులను కూర్చోబెట్టి తతంగాన్ని నడిపిస్తున్నాయి. ల్యాబ్‌ అసిస్టెంట్లు స్వయంగా రీడింగ్స్‌ రాసివ్వడం, సైగల ద్వారా సమాధానాలు చెప్పడం, రికార్డులు అందిస్తూ రాయించడం వంటి దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు 65 శాతం మంది ఎగ్జామినర్లు ప్రైవేట్‌ రంగం వారే కావడంతో పరస్పర అవగాహనతో ఈ వ్యవహారం సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు విద్యార్థులకు జంబ్లింగ్‌ విధానం అమలవుతోంది. విద్యార్థులు తమ సొంత కళాశాలల్లో కాకుండా ఇతర కళాశాలలకు వెళ్లి పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లోని ల్యాబ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నగరంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా అన్ని జిల్లాల పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సంబంధిత విద్యాధికారికి సమాచారం అందించి నిమిషాల వ్యవధిలోనే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను అక్కడికి పంపించేలా చర్యలు చేపట్టారు.

సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికి..

నగరంలోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు స్వయంగా సిబ్బందే సమాధానాలు చెప్పడం, ల్యాబ్‌ అసిస్టెంట్లు రికార్డులను పక్కన పెట్టుకుని రాపిస్తుండటం వంటి దృశ్యాలు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిఘాతో బయటపడ్డాయి. దీనిపై స్పందించిన ఇంటర్‌ బోర్డు నిబంధనలు ఉల్లంఘించిన 14 మంది ఎగ్జామినర్లు, ల్యాబ్‌ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించి బ్లాక్‌ లిస్టులో పెట్టింది. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే విద్యార్ధులతోపాటు సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమాలను అరికట్టేందుకు తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

కొన్ని ప్రైవేట్‌ కళాశాలల్లో మాస్‌ కాపీయింగ్‌

పట్టుబడ్డ 14 మంది ఎగ్జామినర్లు, ల్యాబ్‌ అసిస్టెంట్లు

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో మాయాజాలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement