సింగరేణి సంస్థకు కార్మికులే బలం
నాంపల్లి: సింగరేణి సంస్థ బలం కేవలం ఉత్పత్తిలో కాదని, తరతరాల శ్రమ, క్రమశిక్షణ, పరస్పర నమ్మకంతో పనిచేస్తున్న కార్మికులేనని ఇన్‌ఛార్జి సీఎండీ డి.కృష్ణ భాస్కర్ అన్నారు. మంగళవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెడ్‌హిల్స్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్మికుల భద్రత, సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి ప్రధాన ప్రాధాన్యతలని స్పష్టం చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను మరింత మెరుగుపరచడం, పని పరిస్థితులను మరింత సురక్షితంగా చేయడమే లక్ష్యమన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది ఎన్నో వాతావరణ ప్రతికూలతలు, సాంకేతిక సవాళ్లు, మార్కెట్ మార్పులు ఉన్నప్పటికీ భద్రత ప్రమాణాలను పాటిస్తూ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ముందుకు సాగామన్నారు. ఈ ప్రయత్నంలో ప్రతి గని కార్మికుడు, సూపర్‌వైజర్, అధికారి చూపిన చొరవను ఆయన ప్రశంసించారు. రానున్న సింగరేణి భవిష్యత్‌పై అందరం ప్రశ్నించుకోవాలని, వాటికి సమాధానాలు వెతుక్కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ దిశలోనే ఉత్పత్తి సామర్థ్యం, సంస్థ స్థిరత్వం, భవిష్యత్తు అవకాశాల కోసం మన అనుభవం, సామర్థ్యంతో రాణించే ఇతర రంగాలపైనా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇవి ఇంకా ఆలోచన దశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తును నిర్లక్ష్యం చేయకుండా ముందే సిద్ధమవ్వాలన్న భావనతోనే ప్రయత్నాలు సాగిస్తున్నామని వివరించారు. ఇంధన రంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూ పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో సింగరేణి ఏ పాత్ర పోషించగలదో అన్న దానిపై కూడా ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక బాధ్యతల్లో భాగంగా పరిసర ప్రాంతాల అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాల విషయంలో సింగరేణి తనవంతు పాత్రను కొనసాగిస్తోందన్నారు. సింగరేణిలో మహిళా శక్తి పెరుగుతున్న తీరు, గనుల్లో, ఆపరేషన్‌లో, రక్షణ బృందాల్లో మహిళల భాగస్వామ్యం సింగరేణి పరిణితికి గొప్ప సూచికగా అభివర్ణించారు. రెస్క్యూ జట్టు, గనుల నిర్వహణకు జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపులతో స్ఫూర్తి పొందుతూ మన పనితీరును మరింతగా మెరుగు పరచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బి.వెంకన్న, అడ్వైజర్ ఫారెస్ట్రీ మోహన్ పరిగెన్, జీఎం ( కో ఆర్డినేషన్ ) టి.శ్రీనివాసన్ పాల్గొన్నారు.


