ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ తనిఖీ
సాక్షి, సిటీ బ్యూరో : రాబోయే వేసవి నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ మంగళవారం మియాపూర్ సెక్షన్ పరిధిలోని మయూరి నగర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్లు, ప్రస్తుత ట్యాంకర్ డిమాండ్‌తో పాటు రాబోయే వేసవి కాలంలో ఉండే డిమాండ్‌పై అధికారులతో చర్చించి, అవసరమైన సూచనలు చేశారు. ప్రజా ఫిర్యాదులు, మెట్రో కస్టమర్ కేర్‌కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బల్క్ వాటర్ సప్లై కనెక్షన్ కోసం దరఖాస్తు చేసిన మియాపూర్ లోని నాగార్జున ఎన్‌క్లేవ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సీజీఎంలు కిరణ్ కుమార్, శ్రీనివాస రెడ్డిలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


