వికేంద్రీకృత జల నిర్వహణతోనే నగర భవిష్యత్
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరానికి దీర్ఘకాలిక జల భద్రత, వరదల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా వికేంద్రీకృత జల నిర్వహణ కీలకమని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ స్పష్టం చేశారు. గురువారం జీహెచ్‌ఎంసీ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ)తో కలిసి సీఐఐ (సోహ్రాబ్జీ గ్రీన్ బిజినెస్ సెంటర్)లో నీటి విడుదల, మురుగు నీరు, వర్షపు నీటి నిర్వహణపై స్టేక్‌హోల్డర్ ఇంటరాక్షన్ అండ్ బ్రెయిన్‌స్టార్మింగ్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా జీహెచ్ ఎంసీ వరద కాలువలు, సీవరేజ్ వ్యవస్థ బలోపేతం, నాలాల అభివృద్ధిపై భారీగా నిధులు వెచ్చించిదన్నారు. పెరుగుతున్న నగరీకరణ, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో మౌలిక వసతుల విస్తరణ మాత్రమే సరిపోదని వెల్లడైందని చెప్పారు. డీసెంట్రలైజ్డ్ విధానంలో నీటిని నిల్వ చేసి పునర్వినియోగం చేయడమే వరద ముప్పునకు మొదటి రక్షణ కవచం కానుందన్నారు.


