25 ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు
ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని 25 ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో టీజీఎస్‌ఆర్‌టీసీ సీఎండీ వై.నాగిరెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీలు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఆర్టీసీ గ్రేటర్ జిల్లాల్లో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని భావిస్తోంది. వీటి కోసం ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు 124 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా వేసింది. చార్జింగ్ పాయింట్ల కోసం ఆర్టీసీ నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి, ఫిబ్రవరి 1లోగా అంచనాలు రూపొందించాలని సీఎండీ ముషారఫ్ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు.


