‘హైదరాబాద్ వన్’.. ఈజీ జర్నీ
● లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లక్ష్యంగా కాంబీ టికెట్
● హెచ్‌ఎండీఏ అనుబంధ హుమ్టా ప్రణాళికలు
ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్‌లకు ఒకే టికెట్
సాక్షి, సిటీబ్యూరో: రైలు, బస్సు, మెట్రో ఏదైనా సరే టికెట్ మాత్రం ఒకటే. జేబులో డబ్బులున్నా.. లేకున్నా.. ఈ టికెట్ ఉంటే చాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకై నా ఈజీగా ప్రయాణం చేయొచ్చు.అప్పటికప్పుడు ఏది అందుబాటులో ఉంటే అందులో ఎక్కేయొచ్చు. వివిధ రకాల ప్రజారవాణా సదుపాయాలను ప్రయాణికులకు సమగ్రంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదించిన కాంబినేషన్ టికెట్ త్వరలో వినియోగంలోకి రానుంది. ‘హైదరాబాద్ వన్’ కాంబినేషన్ టికెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) కోసం టెండర్‌లను ఆహ్వానించనున్నట్లు హెచ్‌ఎండీఏ అనుబంధ సంస్థ హుమ్టా అధికారులు తెలిపారు. ‘హైదరాబాద్ వన్ టికెట్ ’ కాంబినేషన్‌గా ప్రవేశపట్టాలా లేక మొబైల్ యాప్ రూపంలో అందుబాటులోకి తీసుకురావాలా? అనే అంశంపైన స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో నగరంలోని 51 ఎంఎంటీఎస్ స్టేషన్‌లకు సిటీబస్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మెట్రో నుంచి సిటీబస్సుల్లోకి మారేందుకు పలు స్టేషన్‌ల వద్ద సదుపాయం ఉన్నప్పటికీ కాంబినేషన్ టిక్కెట్ లేకపోవడంతో ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక సదుపాయాన్ని మాత్రమే వినియోగించుకుంటున్న క్రమంలో లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయం లభించడం లేదు. వివిధ రకాల సర్వీసుల మధ్య కనెక్టివిటీని పెంచడంతో పాటు ‘హైదరాబాద్ వన్’ కాంబి టికెట్‌ను ప్రవేశపెడితే ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.


