స్నాక్స్@ సర్కార్ స్కూల్..
19 రోజులపాటు అల్పాహారం అందించనున్న ప్రభుత్వం
సాక్షి, సిటీబ్యూరో: పదవ తరగతి పరీక్షలు దగ్గరకొస్తున్నాయి..ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదువులపై ఉపాధ్యాయులు దృష్టిసారించారు. ఈ క్రమంలో ప్రత్యేక తరగతులు కూడా ప్రారంభించారు. విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడకుండా సాయంత్రం వేళ అల్పాహారం అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నిధులు కూడా విడుదలచేసింది.
● 19 రోజుల పాటు ...
గత సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం 38 రోజుల పాటు అల్పాహారం అందించారు. అయితే ఈ ఏడాది 19 రోజులే అందించనుంది. సంక్రాంతి సెలవుల అనంతరం రెండు పూటలా తరగతుల నిర్వహణకు మేడ్చల్ జిల్లా విద్యాశాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
● పూటకు రూ.15 మాత్రమే
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 108 ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 8 వేల మంది పదోతరగతి విద్యార్థులు చదువుతున్నారు. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి రోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండగ అనంతరం ఉదయం 8.15 నుంచి 9.15 గంటల వరకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు (సెలవులు కాకుండా) మాత్రమే సాయంత్రం పూట నిర్వహించే ప్రత్యేక తరగతులకు రోజుకు రూ.15తో ఒక్కో విద్యార్ధికి అల్పాహారం అందించేందుకు నిధుల విడుదల ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో సర్కారు బడుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఉదయం అల్పాహారం తినకుండానే పాఠశాలలకు హాజరవుతున్నారు. వీరికి మధ్యాహ్న భోజనమే దిక్కవుతోంది. సాయంత్రం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల అనంతరం ఇంటికి వెళ్లేసరికి ఆలస్యం అవుతోంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు స్వచ్చంద సంస్థలు,దాతలు ముందుకొచ్చి అల్పాహారం అందిస్తే మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు కూడా స్పందిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.
ఒక్కో విద్యార్థికి రూ.15 ఖర్చు
మేడ్చల్ జిల్లాలో 8 వేల మంది టెన్త్ విద్యార్థులు


