నో పార్కింగ్ ప్లీజ్ !
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరభివృద్ధి పనుల్లో భాగంగా ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు వాహనాల పార్కింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులు తమ వాహనాలను 10వ నెంబర్ వద్ద పార్క్‌చేయాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ సూచించారు. స్టేషన్ ప్రాంగణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఒకటో నెంబర్ వద్ద పార్కింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ తక్కువ సమయంలో వాహన రాకపోకలను( పికప్ అండ్ డ్రాప్) సదుపాయాన్ని అనుమతించనున్నారు. పదో నెంబర్ వైపు అనధికార పార్కింగ్, వాహనాల అడ్డంకులను నివారించేందుకు యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు ప్రయాణికులకు 15 నిమిషాల వరకు ఉచిత పికప్ అండ్ డ్రాప్ సదుపాయం కల్పించారు. ఇదిలా ఉండగా మరోవైపు పదో నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు బేస్‌మెంట్‌లో నాలుగు చక్రాల, ద్విచక్ర వాహనాలకు తగిన పార్కింగ్ సదుపాయం అందుబాటులో ఉంది.
డిసెంబర్ పనులు పూర్తి...
ప్రస్తుతం సికింద్రాబాద్ రీడెవపల్‌మెంట్ పనులు 50 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో పనులను వేగంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు మల్టీలెవెల్ కార్ పార్కింగ్, 10వ నెంబర్ వైపు బేస్‌మెంట్ పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి రానున్నాయి.
ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద పార్కింగ్ నిలిపివేత
ప్లాట్‌ఫామ్–10 వద్ద పార్కింగ్ సదుపాయం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మార్పులు


