నేటి నుంచి సర్పంచులకు శిక్షణ
కచ్చితంగా హాజరయ్యేలా..
సాక్షి, రంగారెడ్డిజిల్లా/యాచారం: కొత్తగా ఎన్నికై న సర్పంచులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఐదు విడతల్లో రంగారెడ్డి జిల్లాలోని 525 మంది సర్పంచులకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సభ్యులకు గ్రామ పంచాయతీల పాలన, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్టులోని రెండు సమావేశ మందిరాలను సిద్ధం చేశారు. గ్రామ స్వరూపం, ఇంటి నిర్మాణాలకు అనుమతుల జారీ, ఆస్తి పన్ను వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు, పార్కుల పరిరక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు, వాటిని సద్వినియోగం చేసుకునే అంశం, ప్రభుత్వాలు పేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా చూడటం వంటి అంశాలపై వివరించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మొదటి విడతలో 109 మందికి..
ఈనెల 19 నుంచి 23 వరకు మొదటి విడతలో షాబాద్ మండల పరిధిలోని 41 పంచాయతీలు, మొయినాబాద్ మండల పరిధిలోని 19, చేవెళ్ల మండల పరిధిలోని 25, శంకర్‌పల్లి మండల పరిధిలోని 24 పంచాయతీల సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు.
రెండో విడతలో 103 మందికి..
మాడ్గుల మండల పరిధిలోని 34 మంది సర్పంచులు, ఆమనగల్లు మండల పరిధిలోని 13 మంది, తలకొండపల్లి మండల పరిధిలోని 32 మంది, కడ్తాల్ మండల పరిధిలోని 24 మంది సర్పంచులకు ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నిర్వహించే రెండో విడతలో శిక్షణ ఇవ్వనున్నారు.
మూడో విడతలో 113 మందికి..
ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు కందుకూరు మండల పరిధిలోని 35 మంది సర్పంచులు, నందిగామ మండల పరిధిలోని 19 మందికి, మహేశ్వరం మండల పరిధిలోని 30 మందికి, కేశంపేట మండలంలోని 29 మంది సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
నాలుగో విడతలో 105 మందికి..
ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు నాలుగో విడత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని 47 మంది, కొత్తూరు మండలంలోని 12 మంది, కొందుర్గు మండలంలోని 22 మంది, జిల్లెడ్ చౌదరిగూడ మండల పరిధిలోని 24 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఐదో విడతలో 96 మందికి..
ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు చివరి విడతగా నిర్వహించే శిక్షణ తరగతుల్లో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని సర్పంచులకు అవగాహన కల్పించనున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని 14 మంది సర్పంచులు, ఇబ్రహీంటపట్నం మండల పరిధిలోని 14 మంది, మంచాల మండల పరిధిలోని 23 మందికి, యాచారం మండల పరిధిలోని 24 మందికి, శంషాబాద్ మండల పరిధిలోని 21 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఫిబ్రవరి 27 వరకు ఐదు విడతల్లో ప్రత్యేక తరగతులు
గ్రామ పంచాయతీ పాలన..పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన
ముచ్చింతల్‌లో ఏర్పాట్లు
చేసిన జిల్లా అధికారులు
జిల్లాలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రతి ఒక్కరూ కచ్చితంగా హాజరయ్యేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి ఆయా మండలాల ఎంపీడీఓ, ఎంపీఓలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలం నుంచి అన్ని గ్రామాల సర్పంచులు హాజరయ్యే విధంగా పర్యవేక్షణ చేయడం కోసం జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ అధికారిని నియమించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. శిక్షణ పొందనున్న సర్పంచులకు నిత్యం ఆన్‌లైన్ పోర్టల్‌లో హాజరు నమోదు, చివరి రోజు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా సర్టిఫికెట్ జారీ చేయనున్నారు.


