చైనా మాంజాకు చెక్
ఈ దారంతో పతంగులు ఎగురవేసే వారిపై కేసులు
సాక్షి, సిటీబ్యూరో
‘వినియోగదారులు ఉన్నంత వరకు విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే నిషేధిత చైనా మాంజా రవాణా చేసే, అమ్మే వారితో పాటు దీంతో పతంగులు ఎగుర వేసే వారిపైనా కేసులు నమోదు చేయాలని నిర్ణయించాం’ అని నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ స్పష్టం చేశారు. దీనికోసం సంక్రాంతి ముగిసే వరకు ప్రత్యేక బృందాలతో నిఘా తనిఖీలు ఉంటాయని పేర్కొన్నారు. గురువారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పండగ నేపథ్యంలో బృందాలుగా చేరి పతంగులు ఎగుర వేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఆకస్మికంగా తనిఖీలు చేసే ప్రత్యేక బృందాలు వాళ్లు చైనా మాంజా వాడుతున్నట్లు తేలితే బీఎన్‌ఎస్‌తో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నారు. వీటిలో నేరం నిరూపణ అయితే గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానాలకు ఆస్కారం ఉందని కొత్వాల్ పేర్కొన్నారు. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు చైనా మాంజా వినియోగాన్ని పోత్సహించవద్దని ఆయన సూచించారు.
నెల రోజుల ముందే అప్రమత్తం..
● పతంగుల పండగ నేపథ్యంలో చైనా మాంజా విక్రయంపై నగర పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. దీని వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2016లో, జాతీయ హరిత ట్రైబ్యునల్ 2017లో నిషేధించింది. అయినప్పటికీ విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. దీంతో నెల రోజులుగా నిఘా ఉంచిన అధికారులు ఇప్పటి వరకు 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.24 కోట్ల విలువైన 6226 బాబిన్ల మాంజా స్వాధీనం చేసుకున్నారు.
● ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ల్లో తయారవుతున్న ఈ మాంజాపై పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు ముద్రించి రవాణా చేస్తున్నా రు. దీనికి సహకరిస్తున్న పార్సిల్, కొరియర్ సంస్థల పైనా చర్యలు తప్పవని సజ్జనర్ హెచ్చరించారు. విక్రేతలతో పాటు గోదాములపైనా దాడులు చేస్తున్న స్థానిక, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ మాంజా మూలాలు కనిపెట్టడంపై దృష్టి పెట్టారు. ప్రతి ఏడాదీ మాంజా విక్రయాలపై దాడులు చేసినా పంగుల ముగిసిన తర్వాత అంతా మిన్నకుండిపోతారు. ఈసారి మాత్రం సంక్రాంతి తర్వాత కూడా ఈ కేసుల దర్యాప్తును పర్యవేక్షిస్తామని సజ్జనర్ స్పష్టం చేశారు.
మాంజా బాబిన్లను చూపిస్తున్న సీపీ సజ్జనర్ తదితరులు
ఈ–కామర్స్ వెబ్‌సైట్ల ద్వారానూ అమ్మకాలు...
నగర పోలీసు విభాగానికి చెందిన ఓ ఎస్సై చేపట్టిన డెకాయ్ ఆపరేషన్‌తో ఈ మాంజా విక్రయాలు ఈ–కామర్స్ సైట్ల ద్వారానూ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయా సైట్లలోని క్రయవిక్రయాలను ఆరా తీసిన పోలీసులు కొందరికి నోటీసులు సైతం జారీ చేశారు. ప్రస్తుతం ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్‌మీడియా సైట్లపై నిఘా ఉంచారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ మాంజా తయారు చేస్తున్న సంస్థల వివరాలు కనిపెట్టడంతో పాటు అవసరమైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడం ద్వారా వాటిని సీజ్ చేయించాలని సజ్జనర్ నిర్ణయించారు. ‘తాజా పరిణామాల నేపథ్యంలో హ్యష్‌ట్యాగ్ సే నో టు చైనీస్ మాంజ క్యాంపెయినింగ్ చేపడుతున్నాం. తల్లిదండ్రులూ బాధ్యతగా వ్యవహరించి నూలు దారం వినియోగాన్ని ప్రోత్సహించాలి. సంక్రాంతి ముగిసిన తర్వాత వైర్లు, రహదారులపై ఉన్న మాంజాను తొలగించడానికి జీహెచ్‌ఎంసీ, అటవీ అధికారులతో కలిసి పని చేస్తాం. చైనా మాంజాపై సమాచారం ఉంటే ‘100’కు కాల్ చేసి లేదా 94906 16555కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలి’ అని కొత్వాల్ సజ్జనర్ సూచించారు.
నేరం నిరూపితమైతే ఐదేళ్ల వరకు జైలుశిక్ష
వెల్లడించిన నగర కమిషనర్ వీసీ సజ్జనర్
చైనా మాంజాకు చెక్


