ఎగ్జిబిషన్‌కు ఏర్పాట్లు చకచకా
జనవరి 1న ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
అబిడ్స్: ఎగ్జిబిషన్(నుమాయిష్)కు వేళ అయింది. ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. భద్రతా చర్యలకు నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఆర్.సుఖేష్‌రెడ్డి మంగళవారం ఇక్కడ వివరాలు వెల్లడించారు. 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన శాల(నుమాయిష్) జనవరి 1వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 15న ముగుస్తుందని తెలిపారు. ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు సమక్షంలో ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందన్నారు. ఎగ్జిబిషన్ మైదానంలో స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు అనేకమంది దరఖాస్తు చేసుకోగా, అందులో నుంచి స్టాళ్ల కేటాయింపు దాదాపు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎగ్జిబిషన్‌ను దాదాపు 25 లక్షల మందికిపైగా సందర్శకులు సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు మూడంచెల రక్షణ ఏర్పాటు చేస్తున్నామని, ప్రధాన ద్వారాలైన గాంధీ భవన్, అజంతా గేట్, మాలకుంట గేట్ల ద్వారా ఎగ్జిబిషన్‌లోకి ప్రవేశించేవారిని మెటల్ డిటెక్టర్ల సహాయంతో తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. అంతర్గత భద్రత కోసం సబ్ కమిటీ, సీసీ కెమెరాలు, వాలంటీర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో సందర్శకులను కనువిందు చేసేందుకు ఈసారి ప్రత్యేకంగా రైడ్‌లు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. ఎగ్జిబిషన్ మైదానంలో 1.50 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు వాటర్ ట్యాంక్‌లు, ఫైర్‌కు సంబంధించిన 76 హైడ్రెంట్ వాల్స్‌ను సిద్ధంగా ఉంచామన్నారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


