2027 డిసెంబర్ నాటికి గోదావరి పనులు పూర్తి
జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్–2–3 ప్రాజెక్ట్ పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో గోదావరి నిర్మాణ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లన్న సాగర్ నుంచి ఘన్‌పూర్ వరకు.. అక్కడి నుంచి ఉస్మాన్ సాగర్ వరకు నిర్మించాల్సిన పైపులైన్ విస్తరణ పనులు, ఘన్ పూర్ వద్ద నిర్మించనున్న 80 మిలియన్ లీటర్ల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఘన్‌పూర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల వద్ద నిర్మించే నీటిశుద్ధి కేంద్రాల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్–1 కింద.. నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీరు తరలిస్తోందని, మరో రెండు దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 టీఎంసీల నీరు తరలించేందుకు పనులు ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తలించే మొత్తం నీటిలో 17.5 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా.. జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. సమావేశంలో ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎం మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


