మూడోసారి..ఏమౌనోమరి!
సాక్షి, సిటీబ్యూరో: రెండేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీలో కోట్లాది రూపాయల పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టు పని కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ఫ్లై ఓవర్ల సంగతి అటుంచితే.. కనీసం రహదారుల విస్తరణ పనులు కూడా ప్రారంభం కాలేదు. కొన్నింటికి కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. మరికొన్నింటికి ఇప్పటివరకూ టెండర్లు కూడా పిలవలేదు. ఇంకా కొన్ని పనులకు ఒకటి, రెండు పర్యాయాలకు మించి టెండర్లు పిలిచినా, పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అందుకు తాజా ఉదాహరణ ఓల్డ్‌సిటీలోని తులసీనగర్ నుంచి గౌస్ నగర్ వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు. ఈ పనుల అంచనా వ్యయం రూ.88 కోట్లు.
నిధులు మంజూరు చేసినా..
● హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలనే తలంపుతో పాతబస్తీలోనూ పలు పనులు చేసేందుకు ప్రభుత్వం పలు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసింది. ఫ్లై ఓవర్లతోపాటు ఆయా ప్రాంతాల్లో రహదారులను 100 అడుగుల వెడల్పుతో విస్తరించి అభివృద్ధి చేయాలని భావించింది. అందులో భాగంగా ఆయా పనులకు టెండర్లు పిలుస్తున్నా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. తులసీనగర్– గౌస్ నగర్ వరకు పనులకు టెండర్లు ఆలస్యంగా పిలిచారు. అయినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు మొదలుకాలేదు.
● ఇప్పటికే రెండు పర్యాయాలు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో తాజాగా మూడోసారి టెండర్లు ఆహ్వానించారు. ఈసారైనా కాంట్రాక్టర్లు ముందుకు వస్తారో, రారో తెలియని పరిస్థితి. రహదారి అభివృద్ధిలో భాగంగా వెడల్పుగా మాత్రమే కాకుండా పాదచారులకు ఫుట్‌పాత్‌లు, మీడియన్లలో గ్రీనరీ తదితరమైనవి ఉండాలనేది లక్ష్యం. కానీ.. రెండు పర్యాయాలు ఎవరూ రాలేదు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు లేనందునే కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి.
పాతబస్తీలో రహదారి అభివృద్ధి పనులు
ఈసారైనా కాంట్రాక్టర్లు ముందుకొస్తారా?
అంచనా వ్యయం రూ.88 కోట్లు


