అర్హులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వచ్చే విధంగా జీఓలో సవరింపులు చేపట్టాలని కోరుతూ టీయూ డబ్ల్యూ జే (ఐజేయూ) బృందం సమాచార శాఖ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం సచివాలయం లోని ఐ అండ్ పీఆర్ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ప్రియాంకను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేష్, హెచ్ యూజే అధ్యక్షుడు శిగా శంకర్, మేడ్చల్ అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా, మేడ్చల్ కార్యదర్శి వెంకట్ రాం రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మేకల సత్యనారాయణ సమస్యను ఆమెకు వివరించారు. గ్రేటర్ పరిధిలోని అర్బన్ మండలాల్లో ప్రధాన పత్రికల్లో నలుగురు నుంచి ఐదుగురు జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. నూతన జీవో 252 ద్వారా ఒక పత్రికకు మండలానికి ఒకే అక్రిడిటేషన్ పొందే అవకాశం ఉందని తెలిపారు. జర్నలిస్టుల పరిస్థితిని గుర్తించి జీవోలో సవరణలు చేసి న్యాయం చేయాలని కోరారు. దీనిపై కమిషన్ ప్రియాంక సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే మంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.


