రోడ్డు భద్రత.. పిల్లలకూ బాధ్యత
రహదారి నిబంధనలపై ట్రాఫిక్ పార్కులతో పాఠాలు
సాక్షి, సిటీబ్యూరో
రోడ్డుపై ఎలా వెళ్లాలి? భద్రతకు సంబంధించిన నిబంధనలు ఎలా పాటించాలి? పరిమితికి మించిన వేగం వద్దు. సీట్‌బెల్ట్, హెల్మెట్ ధరించాలి.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయొద్దు. సిగ్నల్ జంపింగ్ చేయొద్దు. మద్యం తాగి బండి నడపొద్దు.. బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.. ఇలా ఎన్నో అంశాలపై పిల్లలకు పెద్దలు రహదారి భద్రత పాఠాలు చెబుతుంటారు. కానీ.. అదే పెద్దలకు పిల్లలతో రోడ్డు భద్రత నియమాలను వివరించేందుకు రవాణా శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. రోడ్డు భద్రతపై పిల్లలే పెద్దలకు పాఠాలు చెప్పేలా ట్రాఫిక్ పార్కుల ఏర్పాటును చేపట్టింది. వీటితో ఒకవైపు చిన్నారుల్లో అవగాహన కల్పిస్తూనే మరోవైపు తమ ఇళ్లల్లో పెద్దలకు జాగ్రత్తలు చెప్పేలా ప్రోత్సహిస్తారు. నగరంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక పార్కు చొప్పున ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. త్వరలో నాంపల్లిలోని ఆలియా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ట్రాఫిక్ పార్కుల ఏర్పాటు కోసం విద్యాసంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన సూచించారు.
ట్రాఫిక్ పార్కులు ఎందుకంటే..
ట్రాఫిక్ పార్కులు ఉపయోగపడతాయి. ఒకవైపు పిల్లలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు పెద్దలకు హెచ్చరిలు అందజేస్తాయి. ట్రాఫిక్ నియమాలపై ప్రయోగాత్మకంగా అవగాహన కలిగించేందుకు ట్రాఫిక్ పార్కులు దోహదం చేస్తాయి. రోడ్డు వాతావరణాన్ని ప్రతిబించేలా రూపొందించిన ట్రాఫిక్ పార్కుల్లో వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలను పాటించాలో చెబుతారు. ఆర్టీఏ, ట్రాఫిక్ విభాగాలకు చెందిన అధికారుల ద్వారా పిల్లలకు ప్రయోగాత్మక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. పదో తరగతి వరకు చదువుకొని బయటకు వెళ్లే సమయానికి ప్రతి విద్యార్థికి రోడ్డు నియమాలపై అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తల్లిదండ్రుల నుంచి వాగ్దాన పత్రాలు..
రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈసారి రవాణాశాఖ మరో కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా చేపట్టింది. అమ్మానాన్న, కుటుంబసభ్యులు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని, హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరిస్తామని’ పేర్కొంటూ పిల్లల ద్వారా వాగ్దాన పత్రాల సేకరణ చేపట్టింది.
ట్రాఫిక్ పార్కులో విద్యార్థులకు రహదారి భద్రతపై పాఠాలు బోధిస్తున్న ఆర్టీఏ సిబ్బంది
చిన్నారులే ఇంటి పెద్దలకు జాగ్రత్తలు చెప్పేలా ప్రోత్సాహం
రవాణా శాఖ అధికారుల ప్రత్యేక చర్యలు
ట్రాఫిక్ పార్కుల ఏర్పాటుకు విస్తృత కార్యాచరణ
ఏం నేర్పిస్తారంటే...
ట్రాఫిక్ నియమాలను సరదాగా, ప్రాక్టికల్‌గా నేర్చుకోవచ్చు.
రోడ్డు సూచనలు, సిగ్నల్స్, క్రాసింగ్‌లను అర్థం చేసుకొనేలా శిక్షణనిస్తారు.
రోడ్డు దాటే సమయంలో సురక్షితంగా నడవడం, సైకిల్ తొక్కడం వంటివి అభ్యాసం చేయిస్తారు.
చిన్న వయసులోనే బాధ్యతాయుతమైన రోడ్డు వినియోగదారులుగా మారేందుకు అవకాశం కల్పిస్తాయి.
ట్రాఫిక్ పార్కులు ప్రతిరోజూ పిల్లలు తమను తాము రక్షించుకొనేలా, భవిష్యత్తులో సురక్షిత డ్రైవర్లుగా, పౌరులుగా తయారయ్యేందుకు దోహదపడతాయి.


