రూ. 3,405 కోట్లు స్టాండింగ్ కమిటీ ఆమోదించిన పనుల అంచనా
● 12 రోజుల్లో ముగియనున్న బల్దియా పాలకమండలి గడువు
● అజెండాలో మొత్తం 53 అంశాలు చేర్చగా.. 52కు అంగీకారం
సాక్షి, సిటీబ్యూరో: రూ. 3,405 కోట్లు. ఇది ఏ కార్పొరేషన్ బడ్జెటో కాదు. త్వరలో గడువు ముగియనున్న జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించిన పనుల అంచనా వ్యయం. జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీన ముగిసిపోనున్న తరుణంలో దాదాపు రూ.3,405 కోట్ల పనులకు గురువారం జరిగిన స్టాండింగ్‌కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 53 అంశాలను అజెండాలో చేర్చగా ఎగ్జిబిషన్ సొసైటీకి స్థలం అద్దె తగ్గింపు వ్యవహారం తప్ప మిగతావాటిని ఆమోదించింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు, కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.
● పనుల్లో రూ. 3 కోట్ల కంటే ఎక్కువ విలువైన వాటిని కౌన్సిల్ ఆమోదానికి పంపించి అనంతరం ప్రభుత్వానికి నివేదిస్తారు.
● బర్కత్‌పురా జంక్షన్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు. బైరామల్‌గూడ ఫ్లైఓవర్ సమీప రోడ్డుకు ఇటీవల మృతిచెందిన కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి పేరు.
సమయం లేదు మిత్రమా..
పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులను ప్రారంభోత్సవ కార్యక్రమాలలో తప్పనిసరిగా భాగస్వాముల్ని చేయాలన్నారు.
అంతుచిక్కని ఆంతర్యం..
జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిన మొత్తం పనుల్లో సీఆర్‌ఎంపీ–2 కింద రోడ్ల నిర్వహణకు రూ.3,145 కోట్లు అత్యధిక మొత్తం అంచనా వ్యయం కాగా, మిగతావి దాదాపు డజను పనుల అంచనా వ్యయం. 12 రోజుల అధికారమే ఉన్నా.. ఇన్ని పనులకు ఆమోదం వెనుక ఆంతర్యమేమిటో అంతుచిక్కని రహస్యమే. పదేళ్ల కాల పరిమితి పనులకు కూడా ఆమోదం తెలపడమే విచిత్రం. రూ. కోట్ల అంచనా వ్యయమున్న పనుల్లో సీఆర్‌ఎంపీ కింద రోడ్ల నిర్మాణం, నిర్వహణ అంచనా భారీ మొత్తంలో ఉండగా, కోట్లలో అంచనా వ్యయమున్న వాటిలో మౌలాలీ ఆర్‌ఓబీ పునరుద్ధరణ, సనత్‌నగర్, ఫతేనగర్ ప్రాంతాల్లో వరద కాలువలు, సివరేజి లైన్లు, పటేల్‌నగర్ ఎస్టీపీ నుంచి డీమార్ట్ వరకు రోడ్డు వెడల్పు పనులు ఉన్నాయి. అలాగే.. హయత్‌నగర్ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణం, అల్వాల్ సర్కిల్‌లోని సెలెక్ట్ టాకీస్ నుంచి మచ్చబొల్లారం వరకు రోడ్డు మరమ్మతులు, మసీదుబండ నుంచి బొటానికల్ గార్డెన్ వరకు రహదారి అభివృద్ధి తదితర పనులున్నాయి.
రూ. 3,405 కోట్లు స్టాండింగ్ కమిటీ ఆమోదించిన పనుల అంచనా


