సిటీకి ‘ఔటర్’ టచ్
పునర్వ్యవస్థీకరణ తర్వాత నగరంలోకి కొన్ని ఠాణాలు
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో హైదరాబాద్ పరిధిలోకీ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) వచ్చింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఒకప్పుడు సైబరాబాద్, రాచకొండల్లో మాత్రమే విస్తరించి ఉండేది. తాజా మార్పుచేర్పులతో దాదాపు 50 కిలోమీటర్లు నగర కమిషనరేట్‌లోకి వచ్చింది. మరోపక్క కొత్తగా ఆదిభట్లలో ఓ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో పాటు ఇప్పటికే రాజేంద్రనగర్‌లో ఉన్న ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌ను అధికారికంగా నోటిఫై చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి.
అలా విస్తరించి..
2016 ఆగస్టు వరకు ఔటర్ రింగ్ రోడ్డంతా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిఽధిలోనే ఉండేది. దీని నుంచి వేరు చేస్తూ నగరానికి తూర్పు భాగంలో సైబరాబాద్ ఈస్ట్ ఏర్పడింది. తర్వాత ఇది అధికారికంగా పని చేయడం ప్రారంభమై.. రాచకొండగా పేరు మారింది. అప్పటి నుంచి ఓఆర్‌ఆర్ సైబరాబాద్‌తో పాటు రాచకొండలోనూ విస్తరించినట్లయింది.
సిటీ పరిధిలోకి రావడంతో..
‘గ్రేటర్’లోని పోలీసు కమిషనరేట్లు, ఇతర యూనిట్లను గత ఏడాది డిసెంబర్‌లో పునర్వ్యవస్థీకరణ చేశారు. కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేయడంతో పాటు సైబరాబాద్, రాచకొండల నుంచి కొన్ని ప్రాంతాలను తీసుకువచ్చి హైదరాబాద్‌లో కలిపారు. ఆదిభట్ల, రాజేంద్రనగర్, శంషాబాద్, మైలార్‌దేవ్‌పల్లి, అత్తాపూర్ వచ్చి నగరంలో కలిశాయి. దీంతో వీటి పరిధిలో ఉండే ఓఆర్‌ఆర్ నగర పరిధిలోకి వచ్చినట్లయింది. మరోపక్క ఓఆర్‌ఆర్ విస్తరించి ఉన్న కమిషనరేట్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు హైదరాబాద్‌లో కలిశాయి. ఇప్పటి వరకు ఆదిభట్ల ప్రాంతం ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ ఠాణా పరిధిలో ఉండేది. తాజా మార్పుచేర్పుల నేపథ్యంలో అక్కడ మరో ట్రాఫిక్ ఠాణా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
అవే పాయింట్లు... అక్కడి సిబ్బందే..
రాజేంద్రనగర్‌లో కొన్నేళ్లుగా ట్రాఫిక్ ఠాణా ఉన్నప్పటికీ అది అధికారికం కాదు. అవసరాలకు తగ్గట్టు ఉన్నతాధికారులు సర్దుబాటుతో ఏర్పాటు చేశారు. ఈ కారణంగా దానికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సిబ్బంది కేటాయించలేదు. ఇది దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు దాన్ని నోటిఫై చేయించాలని నిర్ణయించారు. అలా అధికారికంగా మారితే దానికీ పోస్టులు మంజూరై సిబ్బంది సంఖ్య పెరుగుతుంది. ఈ రెండు అంశాలతో కూడిన ప్రతిపాదనల్ని నగర అధికారులు ప్రభుత్వానికి పంపారు. సైబరాబాద్, రాచకొండ నుంచి వచ్చి నగరంలో కలిసిన ప్రాంతాల్లోని గతంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు కొనసాగించనున్నారు. ఏ ప్రాంతం నుంచి ఈ పాయింట్ వచ్చి కలిసిందో ఆ కమిషనరేట్ నుంచే అవసరమైన సంఖ్యలో సిబ్బందినీ నగరానికి కేటాయించనున్నారు.
ఇప్పటివరకు అవి సైబరాబాద్. రాచకొండ పరిధుల్లోనే..
కొత్తగా ఆదిభట్లలో పోలీసుస్టేషన్, రాజేంద్రనగర్ నోటిఫై
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు


