నకిలీ కరెన్సీ మార్పిడి వ్యవహారంలో ముగ్గురి అరెస్ట్
అబిడ్స్: నకిలీ కరెన్సీని మార్పిడి కేసులో ముగ్గురు నిందితులను గుడిమల్కాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ బి.రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కెన్యా దేశానికి చెందిన హవేస్ హెర్సి సలాద్ (30) నగరానికి వచ్చి టోలిచౌకీ ప్యారామౌంట్ కాలనీలో ఉంటున్నాడు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బాబులాల్ జట్‌కుక్నా (23), ధరమ్‌వీర్ (22)లతో ఇతడికి నకిలీ కరెన్సీ మార్పిడి వ్యవహారంపై సయోధ్య కుదిరింది. ఆదివారం రాజస్థాన్ నుంచి నకిలీ నోట్లు తెచ్చిన బాబులాల్ జట్‌కుక్నా, ధరమ్‌వీర్‌లు గుడిమల్కాపూర్ రింగ్‌రోడ్డు చౌరస్తాలో హవేస్ హెర్సి సలాద్‌కు ఇచ్చేందుకు పిలిపించారు. ముగ్గురి మధ్య నోట్ల మార్పిడి వ్యవహారంలో వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్డుపైనే పట్టపగలు ముగ్గురు ఒకరిపై ఒకరు దూషించుకోవడంతో స్థానికులు గమనించి వెంటనే గుడిమల్కాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో ఎస్.ఐ.నరేష్, సిబ్బందితో వెళ్లి ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ చేయగా తొమ్మిది రూ.500 నోట్ల నకిలీ బెండళ్లను రాజస్థాన్ నుంచి తెచ్చి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. కేసును గోల్కొండ జోన్ డీసీపీ జి.చంద్రమోహన్ పర్యవేక్షణలో గోషామహల్ ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


