యూట్యూబ్‌లో చూసి..చోరీ చేసి..!
నేపాలీ దొంగల గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్‌లో ఉన్న నందగిరిహిల్స్‌లో నివసించే ప్రముఖ వ్యాపారి రవీంద్రశర్మ ఇంట్లో ఈ నెల 5న భారీ చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆద్యంతం పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన ఈ ముఠా రవీంద్ర ఇంట్లో ఉన్న లాకర్ ఎలా పగులకొట్టాలనే అంశాన్ని యూట్యూబ్‌లో సెర్చ్ చేసింది. అందులో పేర్కొన్నట్లే రాడ్లు వినియోగించి పగులకొట్టడంతో పాటు అందులో ఉన్న రూ.1.2 కోట్ల సొత్తు, సొమ్ము ఎత్తుకుపోయింది. ఈ గ్యాంగ్‌లోని నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
కీలకంగా వ్యవహరించిన భార్యభర్తలు..
నేపాల్‌కు చెందిన జీవన్ చాంద్, తన భార్య బీమ్లాతో కలిసి కొన్నేళ్లుగా నగరంలో నివసిస్తున్నాడు. గతంలో పని మనిషిగా చేరి ఆ ఇంట్లోనే చోరీలు చేసిన చరిత్ర ఇతడికి ఉంది. నేపాల్‌కు చెందిన భూపేందర్ సాహి అలియాస్ భువన్‌ను నగరానికి పిలిపించే జీవన్... కోకాపేటకు చెందిన మదన్ ఖత్రి ద్వారా రవీంద్ర శర్మ ఇంట్లో గత నెల 18న పని మనిషిగా చేరుస్తాడు. నేపాల్ నుంచి వచ్చి నవీ ముంబైలో నివసిస్తున్న లలిత్ బహదూర్ వద్ద ఉంటున్న నేపాలీలు కృష్ణ కాంత్, కమల్ చాంద్‌లతో భువన్‌కు పరిచయం ఉంటుంది. జీవన్, బీమ్లా సూచనల మేరకు రవీంద్ర శర్మ ఇంటిని రెక్కీ చేసిన భువన్ చోరీ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయాన్ని కృష్ణ, కమల్‌లకు చెప్పి ఇంటితో పాటు పరిసరాలను వీడియో తీసి షేర్ చేస్తాడు. ఈ వీడియోలో వారింట్లో ఉన్న లాకర్‌ను చిత్రీకరిస్తాడు.
లక్డీకపూల్‌లోని లాడ్జిలో మకాం..
రవీంద్ర శర్మ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్న భువన్ ఈ నెల 3న కృష్ణ, కమల్‌లను నగరానికి రప్పించాడు. లక్డీకపూల్‌లోని ఓ లాడ్జిలో బస చేసిన ఈ ద్వయం విషయాన్ని జీవన్‌కు చెప్పింది. తనపై అనుమానం రాకుండా ఆ వెంటనే అతగాడు నేపాల్ వెళ్లిపోయాడు. అక్కడకు వచ్చాక సొత్తు పంచుకుందామని వీరికి చెప్పాడు. ఈ నెల 5 రాత్రి రవీంద్రశర్మ కుటుంబం ఫంక్షన్‌కు వెళ్లడంతో అదే రోజు నేరం చేయాలని నిర్ణయించుకుంటారు. భువన్ నుంచి సమాచారం అందుకున్న కృష్ణ, కమల్ వేర్వేరుగా బయలుదేరి నందగిరిహిల్స్‌కు చేరుకుని భువన్‌ను కలుస్తారు. రెండు క్యాబ్‌లు మారి అక్కడకు వస్తారు. మార్గమధ్యంలో రవీంద్ర ఇంట్లో ఉన్న లాకర్ లాంటి వాటిని ఎలా పగులకొట్టాలో యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తారు.
చికెన్‌లో సాధ్యం కాక జ్యూస్‌లో..
ఆ సమయంలో రవీంద్ర ఇంట్లో ఉన్న వాచ్‌మెన్‌తో పాటు అతడి భార్యకు మత్తుమందు ఇవ్వాలని ఈ త్రయం పథకం వేస్తుంది. కొన్ని మత్తు మాత్రలు సంగ్రహించిన వీళ్లు తొలుత చికెన్‌లో కలిపి ఇవ్వాలని భావిస్తారు. దీనికోసం ఆ సమీపంలోని ఓ దుకాణాకి వెళ్లే ముగ్గురూ చికెన్ కొంటారు. దుకాణదారుడికి చెల్లించడానికి తమ వద్ద సొమ్ము లేకపోవడంతో దుకాణంలో స్కానర్‌ను ఫొటో తీసే భువన్ దాన్ని లలిత్‌కు పంపగా అతడు చెల్లిస్తాడు. చివరకు జ్యూస్‌లో కలిపిన మత్తు మందు ఇస్తారు. నేరం చేసిన తర్వాత భువన్ ఒకవైపు, మిగిలిన ఇద్దరూ మరో వైపు పారిపోయి నవీ ముంబై చేరతారు. దీనిపై సమాచారం అందుకున్న బీమ్లా సైతం నేపాల్ పారిపోతుంది. ఇలా పారిపోయే ప్రయత్నాల్లో నందగిరిహిల్స్‌లోనే భువన్ ఫోన్ పడిపోయింది.
ఇటీవల జూబ్లీహిల్స్‌లోనేరం చేసిన గ్యాంగ్
స్కానర్ ఇచ్చిన క్లూ ఆధారంగా కేసు కొలిక్కి
పోలీసుల దర్యాప్తులోవెలుగులోకి కీలకాంశాలు
ఈ ఫోన్ స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అందులో ఉన్న స్కానర్ ఫొటో ఆధారంగా లలిత్ ఆచూకీ కనిపెడతారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కథ మొత్తం బయటకు వస్తుంది. దీంతో నేపాల్ సరిహద్దుల్లో కాపుకాసిన నగర అధికారులు ఎస్‌ఎస్‌బీ సహకారంతో నిందితులను పట్టుకుంటుంది. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న జీవన్, బీమ్లా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వీళ్లు ప్రస్తుతం నేపాల్‌లో ఉండటంతో ఇక్కడకు రప్పించే మార్గాలను అన్వేషిస్తున్నారు.
లలిత్‌ను పట్టుకోగా గుట్టురట్టు...


