నవ వధువు మృతి
రాజేంద్రనగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ముత్తు యాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన లక్ష్మయ్య కుమార్తె ఐశ్వర్య (22) రాజేంద్రనగర్ జన చైతన్య వెంచర్–2లో నివాసముండే రాజు నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజు ఓ నిర్మాణ భవనంలో పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఐశ్వర్య జూబ్లీహిల్స్‌లోని అమ్మగారింటికి వెళ్లింది. ఆదివారం జూబ్లీహిల్స్‌కు వెళ్లిన రాజు రాత్రి అక్కడే ఉండి సోమవారం ఉదయం భార్యను తీసుకుని రాజేంద్రనగర్‌లోని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఆమె ఇంట్లో వంట చేస్తూ ఫిట్స్ రావడంతో కిందపడింది. రాజు అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది.
భర్తే హత్య చేశాడు...
తన కుమార్తె ఐశ్వర్యను భర్త రాజు హత్య చేశాడని ఆరోపిస్తూ తండ్రి లక్ష్మయ్య, అన్న వెంకటేశ్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్‌లైన రెండు రోజుల నుంచే అదనపు కట్నం కోసం తిట్టి కొట్టేవాడని ఐశ్వర్య తనతో చెప్పిందని లక్ష్మయ్య బోరున విలపించాడు. తాను అంధుడనినని కట్నం ఇచ్చుకోలేనని బిడ్డను సముదాయించి పంపించానన్నారు. బిడ్డను చంపుతాడని అనుకోలేదని నిందితున్ని కఠినంగా శిక్షించాలని కోరాడు. ఐశ్వర్య మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ ముత్తు యాదవ్ తెలిపారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో ఎలాంటి గాయాలు లేవని.. సహజ మరణంగా వెల్లడించారన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


