మారిన ఆహారపు అలవాట్లతో స్థూలకాయం
● కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ● ఉత్సాహంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్
గచ్చిబౌలి:
మారిన ఆహారపు అలవాట్ల కారణంగానే యువత స్థూలకాయం బారిన పడి అనేక సమస్యలు ఎదుర్కొంటోందని బొగ్గు, కేంద్ర గనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా 57వ ఎడిషన్ ‘సండేస్ ఆన్ సైకిల్’ను జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ స్థూలకాయం కారణంగా యువతతో పాటు అనేక మంది ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఐటీ, ఫార్మా, హెల్త్ రంగంలో ప్రపంచంలోనే భారత్ మేటిగా ఉందన్నారు. దేశంలో స్థూలకాయం కారణంగా యువత దేశానికి సరైన సేవచేయలేకపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. స్మార్ట్‌ఫోన్లు యువశక్తిని నిర్వీర్యం చేస్తాయని, ఫిట్‌నెస్‌పై యువత దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ వాడకంలో పది శాతం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుఇచ్చారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. ఆరోగ్య భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం 30 నిమిషాలకు మించి వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆరోగ్యవంతమైన యువత మేధస్సే దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం పలు విన్యాసాలు ప్రదర్శించారు. సైక్లింగ్‌లో విజేతలు, పాల్గొన్న వారికి బహమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫిట్ ఇండియా ప్రతినిధులు, క్రీడాకారులు, ఐటీ కంపెనీల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


