ఇక చరిత్రలోనే..
వీటి స్థానంలో మెట్రో స్టేషన్ల నిర్మాణం
ఓల్డ్ ఎంసీహెచ్ భవనం..
● కాలగర్భంలో కలిసిపోనున్న మూడు వారసత్వ కట్టడాలు
● ఎంజీబీఎస్– ఫలక్‌నుమా వరకు మెట్రో పనులు చకచకా
చార్మినార్: దారుషిఫాలోని ఓల్డ్ ఎంసీహెచ్ భవనం.. శాలిబండ క్లాక్ టవర్.. అలియాబాద్ సరాయ్.. ఈ మూడు వారసత్వ (హెరిటేజ్) కట్టడాలు కాలగర్భంలో కలవనున్నాయా? వీటి స్థానంలో మెట్రో స్టేషన్లు ఆవిర్భవించనున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఔను అనే వస్తున్నాయి. పాతబస్తీలో మెట్రో రైలు పరుగులు తీయడానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణతో పాటు ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో స్టేషన్ల కోసం ఇప్పటికే స్థలాలను ఎంపిక చేశారు. ఇందులో ఈ మూడు హెరిటేజ్ కట్టడాలను తొలగించి వాటి స్థానంలో మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ఈ వారసత్వ కట్టడాల చరిత్రను ఒకసారి అవలోకనం చేస్తే..
అలియాబాద్ సరాయ్..
శాలిబండ నుంచి ఫలక్‌నుమా వెళ్లే ప్రధాన రోడ్డులో షంషీర్‌గంజ్ కన్నా ముందు అలియాబాద్ సరాయ్ చారిత్రక ప్రాంతం ఉంది. హెరిటేజ్ కట్టడమైన అలియాబాద్ సరాయ్‌లో ప్రస్తుతం వివిధ రకాల వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మరో మెట్రో స్టేషన్ రానుంది. నిజాం కాలంలో నగరానికి ఉన్న 13 దర్వాజాల్లో అలియాబాద్ కూడా ఒకటి. ఈ దర్వాజా పక్కనే యాత్రికుల సౌకర్యార్థ్యం విశ్రాంతి గదులను నిర్మించారు. కుతుబ్ షాహీల కాలంలో నగరానికి వచ్చే యాత్రికులు రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవడం కోసం చార్మినార్ నుంచి 2.5 కిలో మీటర్ల దూరంలో అలియాబాద్ సరాయ్‌ను నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ మెకానిక్, టైలర్, గార్మెంట్స్.. ఇలా దాదాపు 60 దుకాణాల వరకు కొనసాగుతున్నాయి.
చార్మినార్ నుంచి చాంద్రాయణగుట్టకు వెళ్లే ప్రధాన రహదారిలో శాలిబండ ఏరియా ఉంది. ఈ ఏరియా క్లాక్ టవర్ పేరుతో ఫేమస్. ఇక్కడే మరో మెట్రో స్టేషన్ ఏర్పడనుంది. రాజా రాయ్ రాయన్స్ బహదూర్, రాజా చందూలాల్.. వీరిరువురు కుతుబ్ షాహీల కాలంలో రెవెన్యూ, అడ్మినిష్ట్రేషన్ పనులు చూసేవారు. శాలిబండ వద్ద రాజా రాయ్ రాయన్స్ ప్యాలెస్ ఉండేది. అప్పటి స్థానికుల సౌకర్యార్థం సమయం తెలియడం కోసం 1904లో యురోపియన్ స్టైల్‌లో ఈ క్లాక్ టవర్ నిర్మితమైంది. నలువైపులా గడియారాలను ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, రోమన్ భాషల్లో గంటల శబ్దంతో నిర్మించారు. 18వ శతాబ్దంలో మిలిటరీ క్వార్టర్స్ ఉండగా.. 19వ శతాబ్దానికల్లా నగరం విస్తరించడంతో నివాస ప్రాంతంగా రూపాంతరం చెందింది.
ఎంజీబీఎస్ నుంచి మొదలయ్యే మెట్రో రైలుకు మొదటి మెట్రో స్టేషన్‌గా దారుషిఫాలోని పాత బల్దియా కార్యాలయాన్ని ఎంపిక చేశారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటుకు ముందు ఎంసీహెచ్ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్)గా ఉండేది. ఎంసీహెచ్ ప్రధాన కార్యాలయం దారుషిఫాలో ఉండేది. కౌన్సిల్ సమావేశాలు ఇక్కడే జరిగేవి. జీహెచ్‌ఎంసీ ఏర్పడిన అనంతరం ఈ భవనాన్ని కులీకుతుబ్ షా నగరాభివృద్ది సంస్థ(కుడా)కు అప్పగించారు. పాతబస్తీ అభివృద్ది కోసం ప్రత్యేకంగా ఏర్పడిన కుడా భవనం స్థలంలో ఇప్పుడు మెట్రో స్టేషన్ రానుంది. ఈ భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా కుడా అధికారులకు నోటీసులు జారీ చేశారు.
ఇక చరిత్రలోనే..
ఇక చరిత్రలోనే..


