ఓ బాట‘సారీ’!
నగర రహదారులపై పాదచారికి నరకమే
సాక్షి, సిటీబ్యూరో: ‘పెడస్ట్రియన్ ఈజ్ కింగ్ ఆఫ్ ది రోడ్’ (పాదచారే రహదారికి రారాజు)... ఈ అంతర్జాతీయ నానుడి రాజధాని నగరంలో మాత్రం అమలుకావట్లేదు. ఈ సిటీ పెడస్ట్రియన్‌కు ఏమాత్రం సేఫ్ కాదని ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు, కనిపించని మౌలిక వసతులే స్పష్టం చేస్తున్నాయి. నగరంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. ఈ ఏడాది మృత్యువాతపడిన వారి సంఖ్య 294గా ఉండగా.. వీరిలో పాదచారులే 105 మంది. అంటే.. 35.71 శాతం అన్నమాట. ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ప్రతి ఏడాదీ పదుల సంఖ్యలో...
నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమ వుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారు ఎవరెవరు అనేది గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. ఈ ఏడాది పోలీసు రికార్డుల ప్రకారం 2,679 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... వీటిలో పాదచారులకు సంబంధించినవి 837 ఉన్నాయి. మొత్తం యాక్సిడెంట్స్‌లో 294 మంది చనిపోగా.... వీరిలో పాదచారులు 105 మంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారు తున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండోస్థానం పాదచారులదే. ఈ పెడస్ట్రియన్ యాక్సిడెంట్స్‌తో అత్యధికం ఇన్నర్ రింగ్ రోడ్‌లో జరిగినవే కావడం గమనార్హం.
ఈ దుస్థితికి కారణాలు అనేకం...
రాజధానిలో ఉన్న రహదారులపై పాదచారులు భద్రంగా తిరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పురాతన నగరమైన పాతబస్తీలోనే కాదు... ఇటీవలే రూపుదిద్దుకుని, నానాటికీ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోనూ ఇవి మచ్చుకై నా కనిపించవు. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలోనూ పాదచారులకు సరైన ప్రాధ్యానం లభించట్లేదు. ప్రణాళిక లోపం కారణంగా నగర ఫుట్‌పాత్‌ల్లో సగం ఆక్రమణకు గురికాగా... మిగిలిన చోట్ల అనేక అడ్డంకులు వస్తున్నాయి. జంక్షన్స్ వద్ద పెడస్ట్రియన్స్ క్రాసింగ్ కోసం ప్రత్యేకమైన చర్యలు లేవు. కీలక ప్రాంతాల్లో కనీసం రెండడుగుల వెడల్పుతో ఫుట్‌పాత్ ఏర్పాటు చేయాలని, దీనికి బారికేడింగ్, అవసరమైన ప్రాంతాల్లో క్రాస్ చేసేందుకు ఓపెనింగ్స్‌తో కూడిన ప్రతిపాదనలకు పూర్తిస్థాయిలో అమ లు కావట్లేదు. పెలికాన్ సిగ్నల్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు ఇప్పటికీ అవరమైన సంఖ్యలో కనిపించవు.
ఇది పెడస్ట్రియన్ ఫ్రెండ్లీ సిటీ కాదు
నగరంలో రోడ్డు భద్రత, పాదచారుల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు అనేకం ఉన్నాయి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 50 శాతం పైగా పాదచారులు ఉంటున్నారు. సిటీలో చూసుకున్నా పరిస్థితి దాదాపు ఇలానే ఉంది. దీనికి ప్రధాన కారణం రోడ్డు వినియోగం విషయంలో పాదచారుడికి అతి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే. ఇక్కడ ఏ ప్రాంతంలోనూ సరైన ఫుట్‌పాత్స్, పెడస్ట్రియన్ క్రాసింగ్స్‌తో పాటు జంక్షన్స్‌లోనూ అవసరమైన వసతులు లేవు. సబ్–వేల ఏర్పాటుకూ అనేక ఇబ్బందులు, భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయి. పాదచారుల భద్రత కోసం అవసరమైన ప్రతి ప్రాంతంలోనూ పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి. ఉన్న మౌలిక వసతుల్ని సైతం వినియోగించకుండా అడ్డదిడ్డంగా రోడ్డు దాటే పాదచారులకు సైతం జరిమానా విధించాలి. సింగపూర్‌లో ఇలా ఎవరైనా దాటితే భారత కరెన్సీ ప్రకారం మొదటిసారి రూ.20 వేలు, రెండోసారైతే రూ. 25 వేలు జరిమానాతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు. మౌలిక వసతులతో పాటు ఇలాంటి కఠినమైన చట్టాలు సైతం రావాలి.
– రహదారి భద్రత నిపుణులు
అబిడ్స్‌లో ఫుట్‌పాత్ ఇలా..
ఇవీ గణాంకాలు:
2023 2024 2025
మొత్తం ప్రమాదాలు 2548 3,058 2679
పాదచారులవి 906 974 837
మొత్తం మృతులు 335 301 294
వీరిలో పాదచారులు 137 118 105
మొత్తం క్షతగాత్రులు 2596 3393 2950
వీరిలో పాదచారులు 813 919 788
(2025 డేటా ఈ నెల 20 వరకు)
ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత
ఈ ఏడాది చనిపోయిన వారి సంఖ్య 105
మొత్తం మృతుల్లో ఇది ఏకంగా 35 శాతం
పట్టనట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగాలు


