అంబేడ్కర్ వర్సిటీ విద్యార్థులకు బంగారు భవిష్యత్
● వీసీ ఘంటా చక్రపాణి
బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ– టీసీఎస్ అయాన్ జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంతో విద్యార్థుల భవిష్యత్ బంగారు బాటగా మారనుందని అంబేడ్కర్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందించిన టీసీఎస్ అయాన్–జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగాంను ఆదివారం ఆయన ప్రారంభించారు. యూనివర్సిటీ చేపట్టిన ఈ సరికొత్త ప్రోగ్రాం గురించి తెలంగాణ వ్యాప్తంగా అన్ని అధ్యయన కేంద్రాల్లో సిబ్బందికి, విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా దూరవిద్య ద్వారా ఉన్నత విద్య అభ్యసించేవారికి టీసీఎస్ అయాన్‌తో కలిసి ఈ కోర్సును అందించడం ఇదే మొదటిదని వెల్లడించారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులను మొదటి సెమిస్టర్ నుంచే కార్పొరేట్ కంపెనీలకు అవసరమయ్యేలా తీర్చిదిద్దుతూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ కోర్సును రూపొందించినట్లు వెల్లడించారు. ఈ కోర్సును డిగ్రీ చదువుతూనే ఏకకాలంలో పూర్తి చేయవచ్చన్నారు. వృత్తి– నైపుణ్యం–శిక్షణ కార్యక్రమాలతో విద్యార్థులకు రానున్న రోజుల్లో విస్తృత అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ పుష్పా చక్రపాణి, ఈఎంఆర్‌ఆర్‌సీ డైరెక్టర్ రవీంద్రనాథ్ సాలమన్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి, టీసీఎస్ అయాన్–జాబ్ అఛీవర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లీనా టిప్రే, విశ్వవిద్యాలయ అధికారులు పల్లవీ ఆబ్డే, ప్లేస్‌మెంట్ అధికారి వేణుగోపాల్‌రెడ్డి, విద్యార్ధి సేవల విభాగం డైరెక్టర్ వై.వెంకటేశ్వర్లు, సిద్దిపేట అధ్యయన కేంద్రం ప్రిన్సిపాల్ సునీత, బానోత్ ధర్మా పాల్గొన్నారు.


