దాసారం బస్తీలో ఉద్రిక్తత
సనత్‌నగర్: దాసారం బస్తీ గుడిసెలకు సంబంధించి కోర్టు స్టే ఆర్డర్ వచ్చిన కొద్దిరోజులకే కొందరు వ్యక్తులు అక్కడి గుడిసెవాసులపై దాడులకు తెగబడ్డారు. దీంతో తమపై దాడి చేసినందుకు నిరసగా ఇద్దరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దాసారం బస్తీ గుడిసెవాసులకు మద్దతుగా కోర్టులో స్టే ఆర్డర్ పత్రాలను ఇటీవల ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ వారికి అందజేశారు. అయితే కొందరు బయటి వ్యక్తులు బుధవారం తెల్లవారుజామున గుడిసెవాసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. తమను ఇక్కడ బతకనివ్వరా..? అంటూ ఇద్దరు వ్యక్తులు ఏకంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేయగా నీళ్లు పోసి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం అందరూ కలిసి ఆందోళనకు దిగారు. ఎస్సార్‌నగర్ పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే వారు దాదాపు గంటల పాటు గుడిసెల ముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని.. బలవంతంగా ఖాళీ చేయించుకునేందుకు కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి అక్కడికి చేరుకుని గుడిసెవాసులను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గుడిసెవాసుల జోలికి వెళ్లవద్దని ఇటీవల కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన కాపీని ఇన్‌స్పెక్టర్‌కు ఎమ్మెల్యే అందజేశారు.
గుడిసెవాసులపై రాళ్ల దాడి
పెట్రోల్ పోసుకుని ఇద్దరి ఆత్మహత్యాయత్నం


