నిర్లక్ష్యమైతే నిప్పే | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యమైతే నిప్పే

Feb 6 2026 7:09 AM | Updated on Feb 6 2026 7:09 AM

నిర్లక్ష్యమైతే నిప్పే

నిర్లక్ష్యమైతే నిప్పే

నిర్లక్ష్యమైతే నిప్పే శనివారాల్లోనూ ఫోన్‌– ఇన్‌

వీటి ఏర్పాటు తప్పనిసరి...

ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సిందే

ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు

హైడ్రా కమిషనర్‌ మార్గదర్శకాలు

నగరంలో అవగాహన కార్యక్రమాలు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఉదంతాలు.. సమీపిస్తున్న వేసవి.. పరిశీలనలో వెలుగులోకి వచ్చిన అంశాలు.. వెరసీ.. ఫైర్‌ సేఫ్టీ నిబంధనలపై హైడ్రా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. త్వరలో ఉల్లంఘనులపై చర్యలకు ఉపక్రమిస్తున్న నేపథ్యంలో నిబంధనలు, మార్గదర్శకాలను కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ బుధవారం విడుదల చేశారు. రాజధానిలోని వాణిజ్య భవనాలు, వ్యాపారులు వీటిని కచ్చితంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న హైడ్రా బృందాలు ఉల్లంఘనులపై మార్చి నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

సెల్లార్లను గోదాంలుగా మార్చకూడదు..

భవనాల సెల్లార్లు కేవలం వాహనాల పార్కింగ్‌ కోసమే. వీటిని గోదాంలుగా మార్చడం, అక్కడ ఉన్న వస్తువులు పోతాయనే ఉద్దేశంతో గ్రిల్స్‌ ఏర్పాటు చేసి తాళాలు వేయకూడదు. అక్కడ చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. సెల్లార్లలో వాచ్‌మెన్‌ల నివాసాలు, క్యాంటిన్లు, వంట గదులు ఉండకూడదు. సెల్లార్లతో పాటు ర్యాంపులు, కారిడార్లు, మెట్ల మార్గాలు ఖాళీగా ఉంచాలి. వ్యాపారాలకు సంబంధించిన వస్తువులు ఆయా చోట్ల నిలువ ఉంచకూడదు. ఏదైనా జరిగితే ఎటువైపు నుంచి సులభంగా బయటకు వెళ్లగలరనే ఎగ్జిట్‌ మార్గాలను సూచిస్తూ సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలి. లిఫ్ట్‌లు ఉన్నా సరే.. మెట్ల మార్గాలను మూసేయకూడదు.

షార్ట్‌ సర్క్యూట్‌కు అవకాశం లేకుండా...

అగ్ని ప్రమాదాలకు ఎక్కువగా షార్ట్‌ సర్క్యూట్లే కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఎస్‌ఓ స్టాండర్డ్స్‌ ఉన్న కరెంటు వైర్లు, స్విచ్‌ బోర్డులు, ప్యానెల్స్‌నే వాడాలి. విద్యుత్‌ లైన్లకు ఎర్తింగ్‌ సరిగా ఉందో లేదో చూసుకోవాలి. భవన విద్యుత్‌ వినియోగానికి తగ్గట్టు పవర్‌ కనెక్షన్లు తీసుకోవాలి. కరెంటు స్తంభం నుంచి వచ్చే వైర్లు, వ్యాపార సముదాయానికి విద్యుత్‌ను సరఫరా చేసే వైర్లను అనుసంధానం చేసే ప్యానల్‌ బోర్డు వద్ద పొరపాటున నిప్పురవ్వలు పడినా వెంటనే మంటలు అంటుకోకుండా కంకరతో ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేయాలి. ఓవర్‌లోడ్‌, వైర్లలో జాయింట్లు లేకుండా చూసుకోవాలి.

ఇప్పటికే ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్న హైడ్రా.. ఇకపై శనివారాల్లోనూ ఫోన్‌–ఇన్‌ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ వారం నుంచి ఇది ప్రారంభం కానున్నట్లు బుధవారం ప్రకటించింది. సెలవు రోజులు మినహా ప్రతి శనివారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఔటర్‌ రింగు రోడ్డు పరిధిలోని ప్రజలు 040-29565750, 040-29565759 లకు ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు.

అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అప్రమత్తం చేసే స్మోక్‌ డిటెక్టర్లు, మానవ ప్రమేయం లేకుండా మంటలను ఆర్పే వాటర్‌ స్ప్రింక్లర్లు, ఫైర్‌ ఎక్స్టింగ్విషర్లు అందుబాటులో ఉండాలి. అవి పక్కాగా పని చేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. అక్కడ పని చేసే ప్రతి ఒక్కరికీ ఫైర్‌ ఎక్స్టింగ్విషర్‌ వినియోగం అవగాహన కల్పించాలి. ప్రమాదం జరిగితే వెంటనే అప్రమత్తం చేసేలా ఫైర్‌ అలారం రెడ్‌ బటన్‌ అందుబాటులో అమర్చాలి. షాపు అలంకరణకు ఉద్దేశించిన వైర్ల జాయింట్లు, సీరియల్‌ బల్బులు, ఫాల్‌ సీలింగ్‌ లైట్లు అమర్చేటప్పడు షార్ట్‌ సర్క్యూట్‌కు అవకాశం లేకుండా చూసుకోవాలి. అపార్టుమెంట్లు కింది భాగంలో కార్యకలాపాలు సాగించే సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా, ఎక్కడైనా ఫైర్‌ నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే.. హైడ్రా కంట్రోల్‌ రూం 90001 13667కు సమాచారం ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement