సెల్‌ఫోన్ల కంటే పుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
కవాడిగూడ: నేటితరం యువత సెల్‌ఫోన్ల కంటే పుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం బుక్‌ఫెయిర్ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సెల్‌ఫోన్లు, సినిమాలకు దూరంగా ఉంటూ యువత పెద్ద ఎత్తున పుస్తక ప్రదర్శనకు రావడం సమాజంలోని మేథో అంతర్మధనానికి నిదర్శనం అని పేర్కొన్నారు. రాజ్యాంగం అందరికి అందుబాటులో ఉండాలని, వేదికలపై మహిళా ప్రాతినిధ్యం పెరగాలన్నారు. పుస్తకాలు కేవలం సమాచారం కోసం కాకుండా, మనిషిలో స్వతంత్ర ఆలోచనలు రేకిత్తించే సాధనాలుగా ఉండాలని ఆయన సూచించారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విశ్వ విద్యాలయాల పరిశోధన పత్రాలను ప్రజలకు చేరువ చేయాలని అన్నారు. విద్య, సాంఘిక సంక్షేమ శాఖలను పుస్తక ప్రదర్శనలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ వీసీ సూర్య ధనుంజయ్, సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి తదితరులు మాట్లాడారు. బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రమా మెల్కొటే, ప్రధాన కార్యదర్శి ఆర్.వాసు, ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యువతకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సూచన


