గోవా విమానంలో గంజాయి పట్టివేత
శంషాబాద్: గోవా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానంలో సీటు కింద దాచి ఉంచిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఐఎక్స్–2746 విమానం గోవా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ప్రయాణికులు దిగిన అనంతరం విమానాన్ని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ, సిబ్బంది పరిశీలిస్తున్న సమయంలో సీటు కింద రెండు నల్లటి టేపులతో ఉన్న ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వాటిని కస్టమ్స్ అధికారులకు అందించగా నార్కోటిక్ బ్యూరో అధికారులను రప్పించి పరిశీలించారు. మొత్తం 1.100 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిగా అధికారులు నిర్ధారించారు. గంజాయి విలువ 1.10 కోట్లు ఉందని తెలిపారు. గంజాయి తీసుకొచ్చిన వ్యక్తులు ఎయిర్‌పోర్టులో ఉన్న విస్తృత తనిఖీల కారణంగా దానిని అందులోనే వదిలి వేశారా? లేదా అదే విమానం కనెక్టివిటిలో మరో ప్రాంతానికి చేరవేసేందుకు ప్రయత్నించారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


