‘డిజిటల్ అరెస్టు’ కేసులో ఢిల్లీ వాసి!
సాక్షి, సిటీబ్యూరో: అమాయకులను డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి అందినకాడికి దండుకుంటున్న ముఠాలో కీలక పాత్రధారిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో నమోదైన రూ.1.07 కోట్ల మోసం కేసులో ఇతడు నిందితుడని డీసీపీ వి.అరవింద్ బాబు బుధవారం వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఢిల్లీ నివాసి గురుదీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్ (42) ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓవృద్ధుడికి (62) గత ఏడాది అక్టోబర్ 16న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో ఫోన్ వచ్చింది. బాధితుడి ఆధార్ కార్డు వినియోగించిన కొందరు అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని, దీనిపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేయనున్నామని బెదిరించారు. తీవ్రంగా భయపడ్డ బాధితుడికి వీడియో కాల్ చేసిన నిందితులు డిజిటల్ అరెస్టు చేశామని, నిరంతరం తమ పర్యవేక్షణలో ఉండాలని చెప్తారు. అరెస్ట్ ముప్పు తప్పాలంటే తాము చెప్పిన బ్యాంకు ఖాతాల్లోకి వెరిఫికేషన్ కోసం నగదు డిపాజిట్ చేయాలని నమ్మించారు. ఇలా విడతల వారిగా బాధితుడి నుంచి రూ.1.07 కోట్లు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ కె.ప్రసాదరావు కేసు దర్యాప్తు చేశారు. ఈ నగదు వెళ్లిన బ్యాంకు ఖాతాలను అధ్యయనం చేసిన పోలీసులు గతంలో దీపక్ గెహ్లావత్, ప్రశాంత్ కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి విచారణ నేపథ్యంలోనే ఢిల్లీకి చెందిన గురుదీప్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది. అక్కడ ట్రావెల్, మనీ ఎక్స్ఛేంజ్ వ్యాపారం నిర్వహించే ఇతగాడు మరికొందరితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. అమాయకులకు ఎర వేసి, వారి పేరు... వివరాలతో కరెంట్ బ్యాంక్ ఖాతాలను తెరుస్తుంటాడు. బాధితుల నుండి వచ్చే డబ్బును ఈ ఖాతాల్లోకి మళ్లించి డ్రా చేయడం ద్వారా ప్రధాన నిందితులకు అందిస్తుంటాడు. తమ బ్యాంకు ఖాతాలను గురుదీప్‌కు ఇచ్చినట్లు ఇద్దరు నిందితులు చెప్పడంతో ఇతడినీ అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు.
నగర వ్యక్తి నుంచి రూ.1.07 కోట్లు స్వాహా రిమాండ్‌కు తరలించిన సైబర్ క్రైమ్ కాప్స్


