బదిలీలలెన్నో | - | Sakshi
Sakshi News home page

బదిలీలలెన్నో

Feb 19 2026 11:02 AM | Updated on Feb 19 2026 11:02 AM

బదిలీలలెన్నో

బదిలీలలెన్నో

ఒకేసారి సుమారు 96 మందికి స్థానచలనం

అవినీతి ఆరోపణలున్నవారికి ప్రాధాన్యతా పోస్టింగ్‌లు

అధికారుల తీరుపై విమర్శలు

నగర విద్యాశాఖలో భారీ ప్రక్షాళన

సాక్షి, సిటీబ్యూరో: నగర విద్యాశాఖలో భారీగా బదిలీలు జరిగాయి. డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్ల నుంచి జూనియర్‌ అసిస్టెంట్ల వరకు స్థాన చలనం కలిగింది. విద్యాశాఖలో ఒకేసారి సుమారు 96 మందిని బదిలీ చేయడం కలకలం సృష్టించింది. మొత్తమ్మీద 12 మంది డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్లు (డిప్యూటీ ఈవో), 24 మంది డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ (డిప్యూటీ ఐవోఎస్‌)లు, 60 జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఉపాధ్యాయ సంఘాల విమర్శలు..

విద్యాశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు బదిలీల ద్వారా ప్రాధాన్యతా పోస్టింగ్‌లు, ఎలాంటి మచ్చలేకుండా ఏడాదిలోపు బాధ్యతలు చేపట్టిన వారికి ప్రాధాన్యం లేని ప్రాంతాలకు బదిలీలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. జిల్లా విద్యాశాఖలో చోటుచేసుకున్న అవినీతి ఆరోపణలపై నేపథ్యంలోనే బదిలీలు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంటూనే ఆరోపణలున్న అధికారులకు ప్రాధాన్యతగల మండలాల్లో పోస్టింగ్‌ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.

కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్‌లు

ప్రక్షాళన పేరుతో జరిగిన బదిలీల ప్రక్రియలోనూ ఆమ్యామ్యాలు కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లు అధికంగా ఉన్న మండలాలు, కార్యాలయాలోని కీలక సెక్షన్లలో పోస్టింగ్‌లకు భారీగానే ‘డిమాండ్‌’ పలికినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఈవో స్థాయి పోస్టుల నుంచి కీలక ఫైళ్లు చూసే అసిస్టెంట్ల వరకు అనుకూలమైన చోట పోస్టింగ్‌లకు కొందరి పైరవీలు ఫలించినట్లు సమాచారం.

మచ్చుకు కొన్ని ఘటనలు..

ఇటీవల బండ్లగూడ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఒకరు ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ ఘటనలో కేవలం ఒక అసిస్టెంట్‌తో పాటు పైస్థాయి అధికారుల ప్రమేయం కూడా ఉందనే అనుమానంతో విచారణ కొనసాగుతోంది.

ప్రైవేట్‌ పాఠశాలల గుర్తింపు పునరుద్ధరణ, అగ్నిమాపక భద్రత, భవన సామర్థ్యం వంటి నిబంధనల్లో లోపాలున్నా, వాటిని సరిదిద్దకుండా ’మామూళ్ల’తో ఫైళ్లు క్లియర్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

రిటైర్‌ అయిన ఉపాధ్యాయుల పెన్షన్‌ ఫైళ్ల క్లియర్‌, సర్వీస్‌ రిజిస్టర్లలో ఎంట్రీలు చేయడానికి కొందరు అసిస్టెంట్లు వేలల్లో డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. డబ్బులు ఇవ్వని వారి ఫైళ్లను నెలల తరబడి పక్కన పెట్టడం ద్వారా వారిని వేధిస్తున్న ఉదంతాలు గతంలో అనేకం వెలుగులోకి వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement