‘హెల్మెట్ లేకపోతే.. యమపురికే’
● రహదారి భద్రతపై ఆర్టీఏ వినూత్న ప్రచారం
నాగోలు : ‘తస్మాత్ జాగ్రత్త..హెల్మెట్ లేకుండా బండి నడిపితే నేరుగా యమలోకానికే వెళ్తారు..’ సాధారణంగా రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు అక్కడక్కడా కనిపించే నినాదం ఇది. అయితే యముడి రూపంలో ఓ వ్యక్తి.. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే తీసుకెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరిస్తూ వినూత్న ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ ఆర్టీఏ నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై గురువారం అలాంటి వినూత్నమైన ప్రచారాన్ని నిర్వహించారు. డాక్టర్ గురువారెడ్డి సారథ్యంలోని సర్వేజన ఫౌండేషన్ సంస్థకు చెందిన కళాకారులు ఈ ప్రచారాన్ని నిర్వహించింది. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నాగోల్‌లో ఏర్పాటు చేశారు.


