దూసుకొచ్చిన మృత్యువు
స్కూటీని ఢీకొన్న కారు.. ఇద్దరి దుర్మరణం
కీసర: కీసర సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్ చదివే విద్యార్థినితో పాటు ఆమె చిన్నాన్న అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన పసుపుల కృష్ణ (38), కూతురు వరుసయ్యే పురాని జ్యోత్స్న (16)ను తీసుకుని ద్విచక్ర వాహనంపై గురువారం రాత్రి బయలుదేరాడు. కుషాయిగూడ నుంచి కీసర మీదుగా మల్యాలకు వెళ్తుండగా ఓఆర్‌ఆర్ దాటిన తర్వాత నీలంరెడ్డి గెస్ట్‌హౌజ్ సమీపంలో ఎదురుగా వేగంగా దూసుకువచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో కృష్ణ, జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణ ఎడమకాలు తుంటి ఎముక విరిగిపోయి కారు బ్యానెట్ డోర్ లోపలున్న ఇంజిన్‌లో ఇరుక్కుపోయిందంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జ్యోత్స్న చీర్యాల చౌరస్తాలోని ఎస్‌ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి నాలుగేళ్ల క్రితమే ఓ ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జ్యోత్స్నకు కృష్ణ వరుసకు చిన్నాన్న అవుతాడని, అతడు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తుంటాడని వారు చెప్పారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌కు స్వల్పంగా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.


