కల్తీ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై దాడి | Hyderabad police raided an illegal bakery unit | Sakshi
Sakshi News home page

కల్తీ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై దాడి

Apr 2 2026 5:43 PM | Updated on Apr 2 2026 5:54 PM

Hyderabad police raided an illegal bakery unit

హైదరాబాద్ : నగర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ బేకరీ ఉత్పత్తులు, అపరిశుభ్రంగా తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ గోల్కొండ టీమ్, టప్పాచబుత్రా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో జిర్రాలోని చాంద్ బేకరీపై దాడి చేసి, రూ. 2.77 లక్షల విలువైన ముడి సరుకులు, ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

బేకరీ యజమాని సయ్యద్ ఖదీర్ (42)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫ్ నగర్‌లో నివాసం ఉండే ఖదీర్‌ నటరాజ్ నగర్‌లో ‘చాంద్ బేకరీ’ పేరుతో తయారీ కేంద్రాన్ని నడుపుతున్నాడు. బేకరీ నిర్వహణ కోసం ప్రభుత్వ అనుమతులు లేవని పోలీసులకు సమాచారం అందింది.

పక్కా సమాచారంతో చాంద్‌ బేకరీపై పోలీసులు దాడులు చేశారు. నకిలీ ఉత్పుత్తులతో పాటు మైదా బస్తాలు, సాస్ కార్టన్లు, డాల్డా, చక్కెర, కొబ్బరి పొడి, కేక్ పౌడర్, ఆయిల్ టిన్నులు, చికెన్, బ్రెడ్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు.

పక్కా  సమాచారం ఆధారంగా గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, టప్పాచబుత్రా పోలీసులు ఈ దాడి నిర్వహించారు. నిందితుడిపై టప్పాచబుత్రా పోలీసులు పలు కింద కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్‌ను హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి అందె శ్రీనివాసరావు పర్యవేక్షించారు. గోల్కొండ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్. వెంకటేష్, టప్పాచబుత్రా ఇన్‌స్పెక్టర్ జి. బాలకృష్ణ, ఎస్.ఐలు కె. వెంకటరమణ, అమ్జద్ షరీఫ్, సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement