మహిళలకు అండగా తెలంగాణ మహిళా కమిషన్
సాక్షి, సిటీబ్యూరో: మహిళా కమిషన్ మహిళలకు అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘నారీ న్యాయ్: హియర్ హర్ ఔట్‘ అనే బహిరంగ విచారణ కార్యక్రమంలో ఉద్యోగ, గృహ హింస వేధింపులు, వివక్ష, ఆర్థిక, సైబర్ క్రై మ్ తదితర సమస్యలపై బాధిత మహిళలనుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మహిళల ఆవేదనను విని వారికి న్యాయం చేకూరేలా, త్వరితగతిన అవసరమైన చర్యలు చేపట్టేందుకే ‘నారీ న్యాయ్: హెయిర్ హర్ ఔట్‘ పేరుతో బహిరంగ విచారణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గృహ హింసపై అత్యధిక ఫిర్యాదులు అందాయని, ఆయా ఫిర్యాదుల్లో నిందితులు ఎన్‌ఆర్‌ఐలు ఉన్నందున కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది పైగా మహిళల ఫిర్యాదులను అందజేశారు. బాధితుల సమస్యలు విని తగు పరిష్కారాలు సూచిస్తూ సంబంధిత శాఖల నుంచి చర్యలు, పెండింగ్ ఫిర్యాదులపై నివేదికలు కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కదిరవన్ పలని, ఉమెన్ సెఫ్టీ డీసీపీలు డా.లావణ్య, టి.ఉషా రాణి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజ, సభ్యులతో పాటు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


