ఓఆర్‌ఆర్‌పై లారీ, కారు ఢీ..
● తండ్రి, కూతురు మృతి
● మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
పటాన్‌చెరు టౌన్: మేడ్చల్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ విజయ్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి శ్రీశైలం, భార్య లక్ష్మి, కూతురు సుభిక్ష (4)తో పాటు వీరి దూరపు బంధువు తిరుపతి, అతడి భార్య జ్యోతిలక్ష్మి, వీరి కూతుర్లు శశిక, ధూవిక మొత్తం ఏడుగురు షిఫ్ట్ కారులో శనివారం రాత్రి మేడ్చల్ నుంచి తిరుపతి బయలుదేరారు. ఈ క్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు ఎగ్జిట్ – 2 సమీపంలో ఓఆర్‌ఆర్‌పై అదే మార్గంలో వెళ్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుభిక్ష అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీశైలంను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. శ్రీశైలం భార్య లక్ష్మి, తిరుపతి, అతడి భార్య జ్యోతిలక్ష్మి, వీరి ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
(ఇన్ సెట్‌లో) మృతులు శ్రీశైలం, సుభిక్ష (ఫైల్)


