భద్రతా వలయంలోభారత్‌ ఫ్యూచర్‌ సిటీ | - | Sakshi
Sakshi News home page

భద్రతా వలయంలోభారత్‌ ఫ్యూచర్‌ సిటీ

Dec 8 2025 11:28 AM | Updated on Dec 8 2025 11:28 AM

భద్రతా వలయంలోభారత్‌ ఫ్యూచర్‌ సిటీ

భద్రతా వలయంలోభారత్‌ ఫ్యూచర్‌ సిటీ

నేడు, రేపు తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌

సాక్షి, రంగారెడ్డిజిల్లా: భారత్‌ ఫ్యూచర్‌ సిటీ పూర్తిగా భద్రతా వలయంలో వెళ్లింది. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వేదికగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌– 2025’ మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కాబోతోంది. దేశ, విదేశాలకు చెందిన ఫార్‌ూచ్యన్‌–500 కంపెనీల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, దిగ్గజ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. వెయ్యి సీసీ కెమెరాలతో 2,500 మంది పోలీసులు నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక చుట్టూ వెయ్యి మంది పోలీసులతో మూడంచెల భద్రత, మరో 1500 మందితో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టనున్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఏర్పాట్లను ఆదివారం ఉదయం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు పరిశీలించారు. విద్యుత్‌, మంచి నీరు, ఇంటర్నెట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సహా ఏసీలు, 3డీ ఎల్‌సీడీ ప్రొజెక్టర్లు, లైటింగ్‌, సౌండ్‌ సిస్టం సహా రిసెప్షన్‌ కౌంటర్‌, ప్రధాన వేదికకు వచ్చిపోయే మార్గాలను పరిశీలించారు. వీఐపీల కోసం ఏర్పాటు చేసిన మూడు హెలీప్యాడ్‌లు సహా వచ్చి పోయే మార్గాలను మరోసారి చెక్‌ చేశారు. ఇదే వేదికగా తెలంగాణ విజన్‌ 2047 డాక్యుమెంట్‌ ఆవిష్కృతం కాబోతున్న నేపథ్యంలో నగరంలో భారీ ఏర్పాట్లు చేశారు. సచివాలయం, అసెంబ్లీ సహా ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన మార్గాలు, మెట్రో పిల్లర్లతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల ముందు వీటిని ఏర్పాటు చేశారు. ఇటు శంషాబాద్‌ నుంచి తుక్కుగూడ, శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా మీర్‌ఖాన్‌పేట వరకు భారీ పోలీసు బందోబస్తును సిద్ధం చేశారు.

ట్రాఫిక్‌ మళ్లింపులు.. ప్రత్యామ్నాయ మార్గాలు

సాక్షి, సిటీబ్యూరో: మీర్‌ఖాన్‌పేటలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2025కు వచ్చే మార్గాల్లో సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఈమేరకు ఆయా మార్గాల్లో అతిథులు, ప్రముఖుల వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా పలు రహదారుల మళ్లింపులు, క్లోజ్‌లు ఉంటాయి. సాధారణ ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రాచకొండ సీపీ జి.సుధీర్‌ బాబు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.

హైదరాబాద్‌– శ్రీశైలం మార్గంలో

ప్రధానంగా హైదరాబాద్‌– శ్రీశైలం జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–765)లో వీడియోకాన్‌ జంక్షన్‌ నుంచి తుక్కుగూడ, నెహ్రూ ఔటర్‌ రోటరీ (ఎగ్జిట్‌ నంబరు–14), హర్షాగూడ, మహేశ్వరం గేట్‌, కొత్తూర్‌ క్రాస్‌ రోడ్స్‌, పవర్‌ గ్రిడ్‌ జంక్షన్‌ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయి. కొత్తూర్‌ క్రాస్‌ రోడ్స్‌ నుంచి పెద్ద గోల్కొండ, ఔటర్‌ ఎగ్జిట్‌–15 మధ్య ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయి. కాబట్టి వాహనదారులు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఔటర్‌ నుంచి ఎన్‌హెచ్‌–765 మీదుగా వచ్చే భారీ వాహనాలు తుక్కుగూడ ఔటర్‌ (ఎగ్జిట్‌ నంబరు–14) వద్ద కాకుండా పెద్ద గోల్కొండ, ఓఆర్‌ఆర్‌ (ఎగ్జిట్‌–15) వద్ద మళ్లింపులు తీసుకోవాలని తెలిపారు.

స్కాన్‌ చేసి.. పార్కింగ్‌ చేయ్‌..

భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వద్ద ఏడు ప్రాంతాల్లో పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతీ పార్కింగ్‌ ఏరియాకు ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ను కేటాయించారు. కోడ్‌ను స్కాన్‌ చేస్తే పార్కింగ్‌ ప్రాంతం రహదారి మార్గాన్ని సూచిస్తుంది. రోడ్లకు ఇరువైపులా అనధికారికంగా వాహనాలను పార్కింగ్‌ చేయకూడదు.

విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తు

శంషాబాద్‌: గ్లోబల్‌ సమ్మిట్‌కు అతిథుల రాక సందర్భంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తును సిద్ధం చేశారు. అతిథులను ఆహ్వానించేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్‌, లాంజ్‌ ఏర్పాటు చేశారు. ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టు ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య ఆధ్వర్యంలో 24 గంటల పాటు అన్ని పాయింట్ల వద్ద బందోబస్తు కొనసాగుతోంది. అతిథుల కోసం ప్రత్యేక లాంజ్‌ ఏర్పాటు చేశారు.

సిటీ ముస్తాబు

మహా హైదరాబాద్‌ తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు ముస్తాబైంది. సమ్మిట్‌కు హాజరయ్యే దేశ, విదేశాల ప్రతినిధులను ఆకట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీ హంగులు, తెలంగాణ సాంస్కృతిక ఆకర్షణల, రంగురంగుల జెండాలు మేళవింపుతో నగరం స్వాగతం పలకనుంది. చారిత్రక కట్టడాలు, పర్యటక ప్రదేశాలు, చెరువులు, ప్రధాన రహదారులు. కూడళ్లు తదితర అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ దీపాల అలంకరణ, కటౌట్లు, ఫ్లెక్సీలు, హైటెక్‌ ప్రొజెక్టర్లు, డిజిటల్‌ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్‌ ఎఫెక్టులతో నగరం తళతళా మెరిసిపోతోంది. ప్రధానంగా అసెంబ్లీ, సచివాలయం, చార్మినార్‌, కాచిగూడ రైల్వే స్టేషన్‌ భవనం.. ఇలా నగరమంతటా ప్రత్యేక లైటింగ్‌తో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు.

హాజరు కానున్న దిగ్గజ కంపెనీల ప్రతినిధులు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సమాలోచనలు, సదస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement