బాంబు.. బూచీ!
● ఈ ఏడాది ఆర్‌జీఐఏకి 18 సార్లు ఈ–మెయిళ్లు
● అత్యధికంగా గత నవంబర్, ఈ నెలలో పదిసార్లు
● ప్రయాణికులు, వైమానిక భద్రతాధికారులు బెంబేలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బూటకపు బెదిరింపులు
శంషాబాద్: బూటకపు బాంబు బూచీలు అటు వైమానిక భద్రతాధికారులు.. ఇటు విమాన ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గడచిన ఏడాది కాలంగా ఇలాంటి సందేశాల సంఖ్య ఇంతకింతకూ రెట్టింపవుతుండటంతో ప్రయాణికులతో పాటు వైమానిక యంత్రాంగానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 18 హాక్స్ (బూటకపు) మెయిల్స్ రావడంతో సైబరాబాద్ పోలీసు యంత్రాగం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టింది. ఇప్పటి వరకు నలుగురిని రిమాండ్‌కు తరలించింది.
ఎవరు.. ఎందుకు..?
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే బాంబు బెదిరింపు ఈ– మెయిళ్లపై చేపడుతున్న దర్యాప్తులో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తిగత సమస్యను కాస్తా భయాందోళనగా మార్చే ఉద్దేశాలు కొందరివైతే.. సమస్యను మరో వ్యక్తిపై నెట్టేందుకు యత్నించిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బాయ్ ఫ్రెండ్ పెళ్లికి అంగీకరించలేదని ఓ టెకీ ఏకంగా అతడి మెయిల్స్ ద్వారా శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ఎయిర్‌పోర్టులు. క్రీడా మైదానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ చేసింది. గుజరాల్ ఎయిర్ ఇండియా ఘటన సైతం తన ప్రియుడిపై మోపేందుకు చేసిన ఈ మెయిల్ గుట్టును గుజరాత్ పోలీసు యంత్రాంగం గుర్తించిన కేసులో శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు కూడా సదరు యువతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వ్యక్తిగత ద్వేషాలతోనూ..
అదేవిధంగా ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు తనతో సరిగా ప్రవర్తించలేదని ఒకరు. మతి స్థిమితం లేని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఓ మైనర్ బాలుడు.. ఇలా తమ వ్యక్తిగత ద్వేషాలను సంతృప్తి చేసుకునేందుకు కూడా ఇలాంటి థ్రెట్ మెయిల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సాధారణ మెయిల్స్ ద్వారా కాకుండా వీటిని ప్రత్యేక యాప్‌ల ద్వారా పంపిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్బాల్లో ఇలాంటి మెయిల్స్ విదేశాల నుంచి కూడా పంపుతున్నారు. వరసగా వస్తున్న థ్రెట్స్ మెయిల్స్‌లో ఇటీవల ఒకే ఐడీతో పలుమార్లు వచ్చిన సందర్భాలను కూడా పోలీసులు శోధిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు ఇప్పటికే నాలుగు కేసుల్లో నలుగురిని రిమాండ్‌కు కూడా తరలించారు.
విమానాలు వెనక్కి..
బెదిరింపు ఈ మెయిళ్ల ప్రభావం ఎంతగా ఉందంటే టేకాఫ్ తీసుకుని మార్గంమధ్యలో ఉన్న విమానాలు కూడా వెనక్కి మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కొన్నింటిని సమీపంలోని ఇతర విమానాశ్రయాలకు సైతం మళ్లించాల్సి వస్తోంది. తాజాగా ఈ నెల 6న మూడు అంతర్జాతీయ విమానాలకు బెదిరింపు మెయిల్స్ రావడంతో కువైట్ విమాన్ని తిరిగి కువైట్‌కు తిప్పి పంపారు. నవంబర్ ప్రారంభం నుంచి ఇప్పటికు మొత్తం పదికిపైగా బాంబు థ్రెట్స్ మెయిల్స్ ఆర్‌జీఐఏ కస్టమర్ సపోర్ట్‌కు అందాయి. సుమారు ఆరుదేశీయ విమానాలు కూడా పక్కవిమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చింది. ఈ పరిణామాలు అటు ప్రయాణికులకు గంటల కొద్దీ ప్రయాణ భారంతో పాటు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటి కారణంగా ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
బెదింపులు వస్తే.. ఉరుకులు పరుగులే..
బాంబు థ్రెట్ మెయిల్స్ అందిన వెంటనే విమానాశ్రయంలోని భద్రతాధికారులు వెంటనే బీటీఏసీ (బాంబు థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ) డిక్లేర్ చేసి విస్తృతమైన తనిఖీలు షురూ చేస్తారు. బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని థ్రెట్ మెయిల్స్ ఉన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.
బాంబు థ్రెట్ మెయిల్స్‌ను తీవ్రంగానే పరిగణిస్తున్నాం. ఇలాంటి కేసుల్లో ఇప్పటికే నలుగురిని రిమాండ్‌కు తరలించాం. సైబర్‌క్రైమ్, ఇంటలిజెన్స్ విభాగాల సమన్వయంతో అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రక్రియ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికు వరకు దర్యాప్తు చేపట్టిన వాటిలో వ్యక్తిగత కారణాలు, మానసిక కారణాలతో కొందరు ఇలాంటి మెయిల్స్ పంపినట్లు గుర్తించాం.
– బి.రాజేష్, శంషాబాద్ డీసీపీ


