ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం
ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన
ఉప్పల్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి– 11.. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనిల్ మెస్సీ–11 జట్లు ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర క్రీడల శాఖ చైర్మన్ శివసేనా రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు రానున్న క్రీడాకారుడు మెస్సీకి భారీ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. రాచకొండ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మెస్సీ రాకతో అనేక ఖండాల నుంచి దిగ్గజాలు వస్తున్నందున అదే తరహాలో భద్రత ఏర్పాట్లు ఉంటాయన్నారు. ప్రేక్షకులు ముందుగానే స్టేడియానికి వచ్చి సీట్లలో కూర్చోవాలని, తద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తొక్కిసలాటకు తావుండదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మెస్సీని చూడటానికి అవకాశం వచ్చినందున అందరూ సహకరించాలని సూచించారు. మంత్రుల వెంట హెచ్‌సీఏ ప్రతినిధి దిల్‌జీత్ సింగ్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, గోవింద్ రెడ్డి తదితరులున్నారు.


