రాష్ట్రంలో ఈ ఏడాది చోటుచేసుకున్న కీలక ఘటనల సమాహారం
తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన 509 మంది మావోయిస్టులు
46 మందిని బలిగొన్న ‘సిగాచీ’ పేలుడు..
గుల్జార్ హౌస్ దుర్ఘటనలో 17 మంది సజీవదహనం
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 20 మంది దుర్మరణం..
ఎస్‌ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది మృతి
తెలంగాణలో ఈ ఏడాది కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టుల ఉద్యమానికి ఓవైపు కోలుకోలేని ఎదురుదెబ్బ తగలగా మరోవైపు గతంలో ఎన్నడూ చూడని తరహాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు అంతులేని విషాదం నింపాయి. ఇక ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ–కారు రేసు కేసులు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి.
మరోవైపు రూ. వందల కోట్లు వెనకేసిన భారీ అవినీతి తిమింగలాల ఉదంతాలు కూడా ఈ ఏడాదే బట్టబయలయ్యాయి. అలాగే పోలీసు బృందాలు ‘డేగ’ కళ్లతో నిఘా వేసి మత్తు ముఠాల భరతం పట్టాయి. మొత్తంగా 2025లో జరిగిన ప్రధాన నేర, విషాద ఘటనలపై సింహావలోకనం ఇది. – సాక్షి, హైదరాబాద్
వరుస ఎన్‌కౌంటర్లతో మావోల లొంగు‘బాట’
మే: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.
నవంబర్: మావోయిస్టు కీలక కమాండర్, సెంట్రల్ కమిటీ సభ్యుడు మడావి హిడ్మా ఏపీ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు.
సెప్టెంబర్13: సుజాత అలియాస్ కల్పన, మైనక్క తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు.
అక్టోబర్: మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ భూపతి మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోగా పుల్లారి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
డిసెంబర్: సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేశ్ ఉయికే ఒడిశాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు.
» మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు సహా వివిధ సందర్భాల్లో కలిపి ఈ ఏడాది తెలంగాణ పోలీసుల ఎదుట మొత్తం 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
» రాష్ట్రానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి (అలియాస్ దేవ్‌జీ) లొంగిపోయేందుకు కేంద్ర హోంశాఖతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
కాకరేపిన రాజకీయ పరిణామాలు..
» గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్నట్లుగా వెలుగు లోకి వచ్చిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతూ వచ్చింది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పోలీసుల ఎదుట లొంగిపోవడం, కోర్టు అనుమ తితో పోలీసులు ఆయన్ను విచారించడం చకచకా జరిగిపోయాయి. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం కీలక పరిణామం.
వెలుగులోకి భారీ అవినీతి అనకొండలు...
ఏప్రిల్ 26: కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్ అక్రమార్జనపై ఏసీబీ సోదాలు చేసి అరెస్టు చేసింది. హరిరామ్ అక్రమాస్తుల విలువ రూ. 100 కోట్లకుపైనే ఉంటుందనే అంచనా ఉంది.
జూన్ 11: సాగునీటి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేసిన నూనె శ్రీధర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోదాల్లో భారీ ఆస్తులు గుర్తించారు. మొత్తంగా రూ. 200 కోట్ల వరకు అక్రమార్జన సొమ్ము పోగేసినట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
జూలై 15: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఈఎన్సీ సి. మురళీధర్‌రావుపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి ఏకకాలంలో 11 ప్రాంతాల్లో సోదాలు చేశారు. మురళీధర్‌రావు అక్రమార్జన రూ. 450 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
డిసెంబర్ 23: మహబూబ్‌నగర్ జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ముడ్ కిషన్ అక్రమార్జనపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆయన వద్ద మొత్తం రూ. 200 కోట్లకుపైగా అక్రమాస్తులను గుర్తించారు.
సెప్టెంబర్: టీజీ ఎస్పీడీసీఎల్‌లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అంబేడ్కర్ ఎరుగుపై అవినీతి ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేపట్టారు. నెలకు రూ. 75,800 వేతనం ఉన్న ఆయన వద్ద ఇప్పటివరకు గుర్తించిన అక్రమాస్తుల మార్కెట్ విలువ రూ. 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది.
డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక బలగం..
జూన్ 26: డ్రగ్స్ కట్టడికి కీలక ముందడుగు పడింది. ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) ఫోర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘ఈగల్’ అధికారులు రాష్ట్ర, అంతర్రాష్ట్ర పరిధిలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల కట్టడితోపాటు నైజీరియన్ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేస్తూ వస్తున్నారు. గత 3 నెలల్లో మూడు ఆపరే షన్లు నిర్వహించి 132 మందిని అరెస్ట్ చేశారు. ఇటీవల ఢిల్లీలో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో నైజీరియన్ల అరెస్టుతో తెలంగాణ ‘ఈగల్’ జాతీయ స్థాయిలో పేరు పొందింది.
దుర్ఘటనల్లో మృత్యుకేళి..
ఫిబ్రవరి 22: నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్న సొరంగం పైకప్పు కుప్పకూలడంతో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు సాంకేతిక సిబ్బంది, నలుగురు కార్మికులతో కలిపి మొత్తం 8 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా... ఎన్డీఆర్‌ఎఫ్, సైన్యం, నౌకాదళం సహా 20కిపైగా ఏజెన్సీలు రంగంలోకి దిగినా కాపాడలేకపోయాయి.
మే 18: హైదరాబాద్ గుల్జార్ హౌస్‌లోని ఒక భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబంలోని 17 మంది సజీవదహనమయ్యారు.
జూన్ 30: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడులో ఏకంగా 46 మంది మృతిచెందారు. మరో 33 మందికిపైగా గాయపడ్డారు.
అక్టోబర్ 25: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు అగ్నిప్రమాదానికి గురవడంతో 19 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
నవంబర్ 3: చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టి దానిపై ఒరిగిపోవడంతో 19 మంది కంకరలో కూరుకుపోయి సజీవదహన మయ్యారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు.
నవంబర్ 17: హైదరాబాద్‌కు చెందిన ముస్లింలు ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుంచి మదీనాకు బస్సులో వెళ్తుండగా డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 45 మంది పాతబస్తీవాసులు మరణించారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సభ్యులున్నారు.


