మధ్యవర్తుల ద్వారా కేంద్రంతో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కీలక చర్చలు
మావోయిస్టు ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసీల హక్కుల కోసం పట్టు
శిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల భవితవ్యంపైనా ప్రశ్నలు... ఆయన డిమాండ్లపై ఇంకా స్పందించని కేంద్ర హోంశాఖ
అందుకే లొంగుబాటులో తాత్సారమన్న ప్రచారం
డిమాండ్లు నెరవేరితే అమిత్ షా ఎదుట లొంగుబాటు?
నెల కిందటే దేవ్‌జీ అంగరక్షకులను అరెస్ట్ చేసిన పోలీసులు
కోరుట్ల: మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ లొంగుబాటు వ్యవహారంలో కొన్ని షరతుల ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలిసింది. అందుకే దేవ్‌జీ లొంగుబాటులో తాత్సారం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ యంత్రాంగంతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలోగా దేశాన్ని మావోయిస్టురహితంగా మార్చాలన్న లక్ష్యంతో సాగుతున్న ఆపరేషన్ కగార్ చివరి దశకు వచ్చిన క్రమంలో దేవ్‌జీ లొంగుబాటు అంశం చర్చనీయాంశమైంది.
కేంద్ర కమిటీ బలహీనం కావడంతో..
మావోయిస్టు పార్టీలోని కీలక నేతల్లో ఒకరైన హిడ్మా సహా వివిధ హోదాల్లో ఉన్న సుమారు 1,800 మంది మావోయిస్టులు గత కొంతకాలంగా జరుగుతున్న కేంద్ర బలగాల కూంబింగ్, ఎదురుకాల్పుల ఘటనల్లో మృతిచెందారు. దీనికితోడు వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలు సహా వివిధ కారణాలతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఫలితంగా మావోయిస్టు కేంద్ర కమిటీ బలహీనంగా మారింది.
ఈ క్రమంలో ఆరు నెలల క్రితం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దేవ్‌జీ లొంగుబాటు కీలకంగా మారింది. దేవ్‌జీ లొంగిపోయినా లేదా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినా ఆపరేషన్ కగార్ ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల క్రితం దేవ్‌జీ అంగరక్షకులను పోలీసులు అరెస్టు చేసినప్పుడే ఆయన దొరికిపోయాడని.. పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఇప్పటికీ ఆయన లొంగుబాటు విషయంలో నెలకొన్న స్తబ్దత వీడటం లేదు.
షరతులతో తాత్సారం?
దేవ్‌జీ లొంగుబాటు విషయంలో షరతులు తెరపైకి రావడంతో మధ్యవర్తుల ద్వారా కీలక చర్చలు సాగుతున్నట్లు ఇటీవల కాలంలో ప్రచారం సాగుతోంది. చివరి దశలో మావోయిస్టు ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసీల హక్కుల ప్రస్తావన కీలకంగా మారినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, నారాయణ్‌పూర్ జిల్లాలతోపాటు జార్ఖండ్‌లోని తూర్పు, పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలు, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అటవీ భూములపై ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతోపాటు వారి ప్రశాంత జీవనానికి వీలుగా కేంద్ర బలగాల క్యాంపుల ఎత్తివేత వంటి అంశాలు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతోపాటు ఉద్యమంలో పనిచేసి జైలుశిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల భవిష్యత్తు ఏమిటన్న అంశంపైనా చర్చించాలని దేవ్‌జీ ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ షరతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రానందునే దేవ్‌జీ లొంగుబాటులో తాత్సారానికి కారణమన్న వాదన వినిపిస్తోంది. అయితే డిమాండ్లన్నీ నెరవేరితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు దేవ్ జీ లొంగిపోతారన్న ప్రచారం జరుగుతోంది.


