150 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్రోద్యమ సమయంలో భారతీయులను ఏకతాటిపైకి తేవడమే కాకుండా, ఇప్పటికీ అదే స్ఫూర్తిని రగిలిస్తున్న వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 7వ తేదీ, శుక్రవారం ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒకే సమయంలో వందేమాతర గేయం ఆలపించాలని కోరింది.
ఏడాదిపాటు కొనసాగే‘వందేమాతరం’ఉత్సవ కార్యక్రమాలను ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా నాణెం, తపాలా బిళ్లను విడుదల చేస్తారు. పౌరులు, విద్యార్థులు, అధికారులు, ప్రజా ప్రతి నిధులు, పోలీసులు, వైద్యులు, ఉపాధ్యా యులు, దుకాణదారులు, ఇతర వర్గాల ప్రజలంతా ఒకేసారి వందేమాతర గేయం ఆలపించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో గవర్నర్, సీఎం నేతృత్వంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చింది. జిల్లా నుంచి మండల స్థాయి వరకు విద్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. మాతృభూమిని కీర్తిస్తూ సాగే ఈ గేయాన్ని బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7వ తేదీన అక్షయ నవమినాడు రచించారు. ఆయన రాసిన ఆనంద్‌మఠ్ నవలలో భాగంగా బంగదర్శన్‌లో ఈ గేయం మొదటిసారిగా అచ్చయింది.


