గళమెత్తిన యావత్ దేశం
న్యూఢిల్లీ: వందేమాతరం ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు జాతీయ గేయం ఆలపించారు. శుక్రవారం దేశమంతటా విద్యాసంస్థల్లో సామూహిక గేయాలాపన చేశారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వందేమాతరం స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గేయంలోని ముఖ్యమైన చరణాలను తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. వందేమాతరం గేయం దశాబ్దాలుగా ఎలా స్ఫూర్తిగా నిలుస్తోందో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వివరించారు.
భరతమాతను సుజలం, సుఫలం, సుఖదాంగా కొనసాగించడానికి మనమంతా బలమైన సంకల్పం తీసుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో రాష్ట్రపతి పోస్టు చేశారు. వందేమాతరం మనకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ గేయం జాతీయవాదాన్ని మేల్కొల్పిందని గుర్తుచేశారు. వందేమాతరం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించారు. మన స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలను గత 11 ఏళ్లలో సమ్మిళిత కృషి ద్వారా నెరవేర్చామని తెలిపారు.
కాంగ్రెస్ పాపం చేసింది: బీజేపీ
కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం, పాపం చేసిందని బీజేపీ అధికార ప్రతినిధి సి.ఆర్.కేశవన్ ‘ఎక్స్’లో విమర్శించారు. వందేమాతరం గేయాన్ని మతంతో ముడిపెట్టి కొన్ని చరణాలను అప్పటి కాంగ్రెస్ నేత జవహర్‌లాల్ నెహ్రూ ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. దుర్గామాతను ఆరాధిస్తున్నట్లుగా ఉన్నాయన్న కారణంతోనే వాటిని తొలగించారని ఆక్షేపించారు. మతపరమైన ఎజెండాకే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచి్చందని ధ్వజమెత్తారు. ఓ వర్గాన్ని సంతృప్తిపర్చాలన్న ఉద్దేశంతోనే జాతీయ గేయాన్ని ముక్కలు చేశారని మండిపడ్డారు.
మోదీ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్
జాతీయ గేయాన్ని 1937లో విభజించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. బంకించంద్ర చటర్జీ రాసిన గేయంలో మొదటి రెండు చరణాలను స్వీకరించాలని అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా సూచించారని గుర్తుచేసింది. నోబెల్ బçహుమతి గ్రహీతను అవమానించడం సిగ్గుచేటు అంటూ మోదీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మోదీ విభజన సిద్ధాంతాన్ని నమ్ముకుంటున్నారని ఆరోపించింది. ప్రధానమంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వందేమాతరాన్ని దశాబ్దాలుగా సగర్వంగా ఆలపిస్తున్నది కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొంది. జాతీయవాదానికి సంరక్షకులం అని చెప్పుకొనే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు వారి శాఖల్లో జాతీయ గేయం, జాతీయ గీతాన్ని ఏనాడూ ఆలపించలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు.


