దురదృష్టవశాత్తూ ముఖ్యమైన చరణాలు తొలగించారు
వందేమాతరం గేయానికి చేసిన గాయం దేశ విభజనకు బీజం వేసింది
ఆ విభజన ఆలోచనా విధానం ఈనాటికీ సవాలు విసురుతోంది
ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
వందేమాతరం ఉత్సవాలు ప్రారంభం
ప్రత్యేక పోస్టల్ స్టాంప్, నాణెం విడుదల
సామూహిక గేయాలాపనలో పాల్గొన్న ప్రధాని
న్యూఢిల్లీ: వందేమాతరం... ఒక మంత్రం, ఒక శక్తి, ఒక స్వప్నం, ఒక సంకల్పం అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వందేమాతరం గేయం తరతరాలుగా మనకు నూతన స్ఫూర్తిని, శక్తిని ఇస్తూనే ఉందని అన్నారు. ప్రఖ్యాత బెంగాలీ సాహితీవేత్త బంకించంద్ర చటర్జీ రచించిన జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాబోయే ఏడాది పాటు దేశవ్యాప్తంగా జరిగే స్మారకోత్సవాలను ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్, నాణేన్ని విడుదల చేశారు. సామూహిక గేయాలాపనలో పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర సమరానికి వందేమాతరం బలమైన గళంగా నిలిచిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు.
ప్రతి భారతీయుడి మనసులోని భావాలను వ్యక్తీకరించిందని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తూ 1937లో వందేమాతరం గేయంలోని ముఖ్యమైన చరణాలను తొలగించారని తప్పుపట్టారు. గేయానికి అసలైన ఆత్మలాంటి చరణాలు కనిపించకుండాపోయాయని అన్నారు. వందేమాతరం గేయానికి చేసిన గాయం చివరకు దేశ విభజనకు బీజం వేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ నిర్మాణానికి చోదకశక్తి అయిన ఈ మహామంత్రానికి అన్యాయం ఎందుకు జరిగిందో ఈనాటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ విభజన ఆలోచనా విధానం ఈనాటికీ మన దేశానికి సవాలు విసురుతోందని వ్యాఖ్యానించారు.
దుర్గామాతగా మారగలం
మన జాతీయ గేయం ప్రతి తరానికీ సమకాలీనమేనని ప్రధాని మోదీ వివరించారు. ఆపరేషన్ సిందూర్‌ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ భద్రత, గౌరవంపై దాడికి దిగిన ముష్కరులకు తిరుగులేని గుణపాఠం నేరి్పంచామని చెప్పారు. నూతన భారతదేశంలో మానవాళికి సేవ చేసే ‘కమల, విమల స్ఫూర్తి’తోపాటు అవసరమైతే దుర్గామాతగా మారడం కూడా మనకు తెలుసని స్పష్టంచేశారు. పది రకాల ఆయుధాలు చేతబూని ఉగ్రవాదులను అంతం చేయగలమని పేర్కొన్నారు. ముష్కరులు మరోసారి మనవైపు కన్నెత్తి చూసే సాహసం చేస్తే ప్రాణాలతో వదిలిపెట్టబోమని పరోక్షంగా హెచ్చరించారు.
మళ్లీ స్వర్ణయుగంలోకి..
విజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పునాదులపై మన దేశాన్ని గొప్పగా నిర్మించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారతదేశ సౌభాగ్యం గురించి ప్రపంచం కొన్ని శతాబ్దాలుగా వింటోందని అన్నారు. కేవలం కొన్ని శతాబ్దాల క్రితం ప్రపంచ జీడీపీలో మన జీడీపీ నాలుగింట ఒక వంతు ఉండేదని తెలిపారు. బంకించంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రచిస్తున్న సమయంలో దేశం స్వర్ణయుగాన్ని కోల్పోయిందని అన్నారు. విదేశీ దండయాత్రలు, దోపిడీ, దౌర్జన్యాలు, అరాచకాలు, వలసవాద విధానాలు మనదేశాన్ని పీల్చిపిప్చి చేశాయని, పేదరికం, ఆకలితో దేశం అల్లాడిపోయిందని గుర్తుచేశారు. భారతదేశం ఎప్పటికైనా పునరై్వభవం సాధించాలని బంకించంద్ర చటర్జీ కలలుగన్నారని చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా మళ్లీ స్వర్ణయుగంలోకి ప్రవేశించాలంటూ బోధించారని తెలిపారు. ఆ దిశగా వందేమాతరం అనే మహోన్నతమైన పిలుపును ఇచ్చారని ప్రధానమంత్రి శ్లాఘించారు.
ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవాలి
బ్రిటిష్ వలసవాదులు వారి దుష్ట పాలనను సమర్థించుకోవడానికి భారత్‌ను వెనుకబడిన దేశంగా, తక్కువ స్థాయి కలిగిన దేశంగా చిత్రీకరించారని ప్రధాని మోదీ ఆక్షేపించారు. వందేమాతరం గేయం ఆ తప్పుడు ప్రచారాన్ని ఫటాపంచలు చేసిందని అన్నారు. దేశం అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం అని భావించేవారిని.. ఈ గేయం దేశాన్ని ఒక తల్లిగా అభివరి్ణంచడం చాలా ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. మన దృష్టిలో తల్లి అంటే జన్మనిచి్చ, పోషించడమే కాకుండా బిడ్డ ప్రమాదంలో ఉంటే కాపాడుకొనే గొప్ప వ్యక్తి, దుషు్టలను దునుమాడే శక్తి అని వెల్లడించారు. వందేమాతరం అసలైన స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ విజయం సాధిస్తోందన్నారు.
‘2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్య సాధన దిశగా దేశం వేగంగా పరుగులు తీస్తోందని పేర్కొన్నారు. మనం ప్రతిసారీ ఒక కొత్త ఘనత సాధించినప్పుడు దేశమంతటా వందేమాతరం ప్రతిధ్వనిస్తోందని హర్షం వ్యక్తంచేశారు. మన ఆడబిడ్డలు కీలక రంగాల్లో విజయాలు సొంతం చేసుకున్నప్పుడు దేశ ప్రజలంతా వందేమాతరం అంటున్నారని తెలియజేశారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ పథకానికి 11 ఏళ్లు పూర్తయ్యాయని ప్రధానమంత్రి వివరించారు. ఉగ్రవాదం, నక్సలిజం, మావోయిస్టు తీవ్రవాదాన్ని ఓడించినప్పుడల్లా మన సైనిక దళాలు వందేమాతరం అని నినదిస్తున్నాయని చెప్పారు. వందేమాతరం స్మారకోత్సవాలు 2026 నవంబర్ 7వ తేదీదాకా కొనసాగుతాయి. ఈ గేయాన్ని బంకించంద్ర చటర్జీ 1875 నవంబర్ 7న అక్షయ నవమి సందర్భంగా రచించారు. అనంతరం ఆయన రాసిన ఆనంద్‌మఠ్ నవలలో ఈ గేయాన్ని చేర్చారు.


