యూసీసీ, ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’పై మోదీ
వాటిని త్వరలోనే నెరవేరుస్తామని వెల్లడి
బీజేపీ ఎదుగుదలకు కార్యకర్తలే మూలం
పార్టీ వ్యవస్థాపక దిన ప్రసంగంలో ప్రధాని
న్యూఢిల్లీ: ‘‘బీజేపీ ఎజెండాలోని కీలకాంశాల్లో అసంపూర్తిగా మిగిలినవి రెండే. ఒకటి ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’. మరొకటి ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘‘వాటిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా సానుకూల చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఆ రెండు హామీలను కూడా నెరవేరుస్తాం’’ అని వెల్లడించారు. బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని వర్చువల్‌గా ప్రసంగించారు.
భారత్‌ను స్వయంసమృద్ధంగా, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ‘‘బ్రిటిష్ హయాం నాటి వందలాది నల్ల చట్టాలను వదిలించుకున్నాం. పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మించుకున్నాం. జనరల్ కేటగిరీలో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించుకున్నాం. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించుకున్నాం. పౌరసత్వ సవరణ చట్టం తెచ్చాం. అయోధ్యలో రామ మందిరం నిర్మించుకున్నాం. ఇవన్నీ బీజేపీ చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాల తాలూకు ఫలితాలే’’ అని పేర్కొన్నారు. వికసిత భారత నిర్మాణానికి తమ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు.
కార్యకర్తలే బలం
ఆరెస్సెస్ అనే వటవృక్షం నుంచి పుట్టుకొచ్చిన బీజేపీ జాతీయ సమగ్రత వంటి ఉన్నత లక్ష్యాల సాధనే పరమావధిగా రాజకీయ రంగప్రవేశం చేసిందని మోదీ అన్నారు. రెండు లోక్‌సభ స్థానాలతో మొదలైన బీజేపీ ఎదుగుదల అప్రతిహతంగా సాగిందంటూ గుర్తు చేసుకున్నారు. ‘‘కాంగ్రెస్‌కు అధికారమే పరమావధి. బీజేపీ ప్రస్థానం మాత్రం సేవే పరమార్థంగా కొనసాగుతోంది. నిత్యం సమాజ హితానికి పాటుపడే పార్టీ బీజేపీ. దేశమే ముందన్నది పార్టీ మనసా వాచా నమ్మే సూత్రం.
నిస్వార్థ సేవకు బీజేపీ కార్యకర్తలు పెట్టింది పేరు. బీజేపీ భావజాలం దేశమంతటికీ విస్తరించడంలో వారిదే కీలక పాత్ర. కార్యకర్తల దశాబ్దాల కృషి ఫలితంగానే పార్టీ ఈ స్థాయికి ఎదిగింది’’ అంటూ ప్రస్తుతించారు. ‘‘దేశంలో కాంగ్రెస్ పాలనలో బీజేపీ కార్యకర్తలు చెప్పలేనన్ని నిర్బంధాలను ఎదుర్కొన్నారు. హింసే రాజకీయ సంస్కృతిగా మారిన పశ్చిమబెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రాణత్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది’’ అన్నారు. బీజేపీ కార్యకర్తలకు పార్టీ వ్యవస్థాపక దిన శుభాకాంక్షలు తెలుపు తూ ఎక్స్‌లో కూడా ప్రధాని పోస్టు పెట్టారు.
ఎన్డీఏకు పాతికేళ్లు
సంకీర్ణ రాజకీయాలకు అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన ఘనత బీజేపీదేనని మోదీ అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఆవిర్భావానికి కూడా పాతికేళ్లు నిండాయని గుర్తు చేసుకున్నారు. ‘‘దేశ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక కూటమి ఎన్డీఏ మాత్రమే. అందరినీ కలుపుకుపోయే తత్వం దాని సొంతం. ప్రాంతీయ ఆకాంక్షలకు పెద్దపీట వేయడం ఎన్డీఏ లక్షణం. దేశవ్యాప్తంగా కూటమి నానాటికీ విస్తరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం’’ అని మోదీ ప్రశంసించారు.
‘‘ప్రజలు వారసత్వ రాజకీయాలనూ చూశారు. వామపక్ష రాజకీయాలనూ గమనించారు. వాటితో పోలిస్తే బీజేపీ మోడల్ పాలన అది్వతీయమైనది. విధాన స్థిరత్వం దాని ప్రధాన లక్షణం. భౌగోళిక మార్పులు, చొరబాట్లు, అవినీతికి అడ్డుకట్ట, బానిస మనస్తత్వం నుంచి ప్రజలకు ముక్తి వంటివి బీజేపీతోనే సాధ్యం. ఆర్టీకల్ 370 రద్దు అసాధ్యమన్నారు. మేం దాన్ని సుసాధ్యం చేసి చూపించాం. జాతీయ భద్రత, ఉగ్రవాదం వంటి కీలకాంశాలపై బీజేపీది ఎప్పుడూ స్థిరమైన వైఖరే’’ అని స్పష్టం చేశారు.
మహిళా పక్షపాతి
బీజేపీ మహిళా పక్షపాతి అని మోదీ స్పష్టం చేశారు. 1994లో తొలిసారిగా మహిళా రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తింది తమ పార్టీయేనని గుర్తు చేశారు. 2029 సాధారణ ఎన్నికల నుంచి లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు స్పష్టం చేశారు. పార్టీలో కూడా మహిళలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.


