ఆసియా ఖండంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా?. ఇటీవల అఫ్గానిస్తాన్.. పాకిస్తాన్ భూభాగంలోని పలు లక్ష్యాలపై డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. అంతకు కొన్ని రోజుల ముందే పాకిస్తాన్ సైన్యం అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసింది. దానికి ప్రతీకారంగానే అఫ్గానిస్తాన్ ఈ డ్రోన్ దాడులు జరిపింది. మార్చి నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ దాడులతో పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. దశాబ్దాలుగా మిత్రదేశాలుగా ఉన్న పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య అసలు ఈ శత్రుత్వం ఎందుకు మొదలైంది? ఇప్పుడు కొత్తగా ఈ ప్రాంతీయ రాజకీయాల్లోకి రష్యా ఎందుకు ఎంట్రీ ఇస్తోంది? ఉక్రెయిన్ యుద్ధంతో బిజీగా ఉన్న రష్యా, హఠాత్తుగా తాలిబాన్లతో చేతులు కలపడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?
అప్పట్లో భాయీ భాయీ..!
పాక్-అఫ్గాన్ పాలిటిక్స్‌లోకి వెళ్లే ముందు ఫ్లాష్‌బ్యాక్ తిరగేస్తే.. ఇప్పుడు ఒకరినొకరు చంపుకుంటున్న ఈ పాకిస్తాన్, తాలిబాన్లు.. ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. 1980ల కాలంలో అఫ్గానిస్తాన్‌లోకి సోవియట్ రష్యా సైన్యం ప్రవేశించినప్పుడు, వారికి వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్లకు, తాలిబాన్లకు పాకిస్తాన్ వెన్నుదన్నుగా నిలిచింది. అమెరికా నుంచి వచ్చిన నిధులను, ఆయుధాలను పాకిస్తానే వీరికి సరఫరా చేసింది. అంతెందుకు.. తాలిబాన్లను తయారు చేసే హక్కానీ యూనివర్సిటీ కూడా పాక్ గడ్డపైనే ఉంది. 1996లో తాలిబాన్లు మొదటిసారి కాబూల్‌ను ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, వారిని అధికారిక దేశంగా గుర్తించిన కేవలం మూడు దేశాలలో పాకిస్తాన్ ఒకటి. ఆ తర్వాత 2001లో అఫ్గానిస్తాన్‌పై అమెరికా దాడి చేసి.. తాలిబాన్లను గద్దె దించినప్పుడు కూడా, పాకిస్తాన్ దొంగచాటుగా తాలిబాన్లకే మద్దతు ఇచ్చింది. అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా పాకిస్తాన్ వినలేదు. ఎందుకంటే, భవిష్యత్తులో ఎప్పుడైనా అమెరికా వెళ్లిపోతే మళ్లీ తాలిబాన్లే అధికారంలోకి వస్తారని పాకిస్తాన్‌కు తెలుసు. వారిని మచ్చిక చేసుకుంటే, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలను.. ముఖ్యంగా ‘తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్’ని వారు అణచివేస్తారని పాకిస్తాన్ ఆశపడింది.
మాట వినని తాలిబాన్లు..!
2021లో అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌ను వదిలి వెళ్ళిపోయాక, తాలిబాన్లు మళ్లీ కాబూల్‌ను హస్తగతం చేసుకున్నారు. పాకిస్తాన్ పండగ చేసుకుంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు, పాకిస్తాన్ మాట వినడం మానేశారు. పాకిస్తాన్‌లో ఘోరమైన దాడులకు పాల్పడే ఖీఖ్కీ ఉగ్రవాదులను, అలాగే బలూచిస్తాన్ విముక్తి పోరాట సమూహాలను అఫ్గానిస్తాన్ గడ్డపై నుంచి ఆపడానికి తాలిబాన్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని ఫలితంగా పాకిస్తాన్‌లో ఉగ్రదాడులు భారీగా పెరిగిపోయాయి. ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్’ నివేదికల ప్రకారం.. గత పదేళ్లలోనే లేని విధంగా 2024, 2025 సంవత్సరాల్లో పాకిస్తాన్ భద్రతా బలగాలు భారీగా నష్టపోయాయి.
దాదాపు 1,200 మందికి పైగా పాక్ సైనికులు, పోలీసులు ఈ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. దాంతో సహనం కోల్పోయిన పాకిస్తాన్, ఇప్పుడు అఫ్గానిస్తాన్ లోపల ఉన్న ఖీఖ్కీ స్థావరాలపై వైమానిక దాడులు చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా కాబూల్, కాందహార్ నగరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ‘మీరు ఉగ్రవాదులను ఆపకపోతే నేరుగా మీపైనే దాడి చేస్తాం’ అని తాలిబాన్లకు హెచ్చరికలు పంపింది. దీంతో.. ఖతార్ జోక్యం చేసుకుని కాల్పుల విరమణ కుదిర్చినప్పటికీ.. అది ఎంతో కాలం నిలవలేదు. మొన్నటికి మొన్న పాకిస్తాన్‌లో జరిగిన ఒక ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్ ఆర్మీ అఫ్గానిస్తాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. దానికి కౌంటర్‌గా తాలిబాన్లు సరిహద్దుల్లో భారీ సైనిక దాడికి దిగారు. ఇప్పుడు తాజాగా అఫ్గానిస్తాన్ డ్రోన్లు పాకిస్తాన్ సరిహద్దు దాటి వచ్చి దాడులు చేశాయి. ఇరు దేశాలూ ఇప్పుడు ఒక అంతం లేని యుద్ధ వలయంలో చిక్కుకున్నాయి.
పాక్‌పై రగిలిపోతున్న తాలిబాన్లు?
సరే, తాలిబాన్లు ఈ ఉగ్రవాదులను ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇక్కడ రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, వారి దగ్గర సరైన వ్యవస్థలు, సైనిక సామర్థ్యం లేదు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం 20కి పైగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. వాటన్నింటినీ అణిచివేయడం తాలిబాన్ల వల్ల కావడం లేదు. రెండోది, తాలిబాన్లలోనే అంతర్గతంగా గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ ఒప్పుకొన్నా, మరో గ్రూప్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తోంది. అయితే, ఈ నిరంతర యుద్ధ వాతావరణంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. అదే.. రష్యా ఎంట్రీ!
గత ఏడాది తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఆ తర్వాత ఈ ఏడాది మే నెలలో రష్యా, అఫ్గానిస్తాన్‌తో ఒక కీలకమైన సైనిక సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, అఫ్గానిస్తాన్ దగ్గరున్న పాత సోవియట్ కాలపు ఆయుధాలను, యుద్ధ విమానాలను రష్యా రిపేర్ చేసి, ఆధునీకరిస్తుంది. ఈ ఒప్పందం తర్వాత తాలిబాన్ల రక్షణ మంత్రి ఒక సంచలన ప్రకటన చేశారు. ‘ఇకపై పాకిస్తాన్ మాపై దాడులు చేయడానికి ధైర్యం చేయలేదు’ అనేది దాని సారాంశం. అంటే రష్యా అండ చూసుకునే తాలిబాన్లు ఇప్పుడు పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారని అర్థం చేసుకోవచ్చు.
రష్యాకు వచ్చే లాభమేంటంటే..?
తాలిబాన్లకు సహాయం చేయడం వల్ల రష్యాకు వచ్చే లాభం ఏంటి? మొదటి లాభం ఏంటంటే.. రష్యాకు కూడా ఉగ్రవాద భయం ఉంది. 2024లో మాస్కో కాన్సెర్ట్ హాల్‌పై దాడి చేసిన ‘ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్’ ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్ నుంచే ఆపరేట్ చేస్తున్నారు. తాలిబాన్లతో దోస్తీ చేస్తే, ఆ ఉగ్రవాదులను అణచివేయవచ్చన్నది రష్యా ప్లాన్. ఇక రెండోది, ఉక్రెయిన్ యుద్ధం వల్ల సెంట్రల్ ఆసియాలో రష్యా కోల్పోయిన పట్టును మళ్లీ సాధించడం. ఇందుకోసం రష్యా తన నేతృత్వంలోని ఇ ఖీౖ కూటమిని వాడుకుంటోంది. తజకిస్తాన్ సరిహద్దుల్లో రష్యా తన సైనిక ఉనికిని భారీగా పెంచుతోంది. చివరగా చెప్పాలంటే.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య శాంతి కుదరాలంటే అఫ్గాన్ గడ్డపై ఉగ్రవాదం అంతం కావాలి. అందుకు తాలిబాన్లకు సైనిక, ఆర్థిక సహాయం అవసరం. ఇప్పుడు రష్యా ఆ పాత్రను పోషించడానికి సిద్ధమైంది. మరి రష్యా రాకతో ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందా? లేదా పాకిస్తాన్, రష్యాల మధ్య కొత్త విభేదాలకు దారితీస్తుందా? అనేది కాలమే నిర్ణయించాలి.
-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు


